పుట:Aliya Rama Rayalu.pdf/238

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వేంగళనాథస్వామివారికి నెనుములచింతలయను గ్రామమును దానము చేసెను. యలదుఱ్ఱులోని శ్రీరంగనాధస్వామివారి యర్చకత్వమును సలుపుటకై తమ్మయగౌడునకు మహానాయకాచార్య నాగినాయకుడును నాయనగొట్టెకుంటయను గ్రామమునుదానము చేసెను. గుందుర్తి పాపయ్యయను నతడు వేల్పుచర్లలోని యమ్మవారికి మూడుగ్రామముల నొసంగెను. నంద్యాల తిరుమలయ్య దేవమహారూజు చెన్నకేశవస్వామివారికి కోడూరుగ్రామము నొసంగుటయెగాక నందపాడుగ్రామమున గొంతభూదానముగూడ చేసియుండెను. కొండ్రాజుచిన్నతిమ్మరాజు అహోబలనృసింహస్వామివారి కొకగ్రామము సమర్పించెను. ఒంటిమిట్టరఘునాయకదేవునికి నాగరాజయ్యగారు గంగపేరూరనుగ్రామము నొసంగెను. నంద్యాలతిమ్మయ్యదేవమహారాజు, చిన్నఔబలేశ్వరదేవమహారాజు ఘండికోటరఘునాయక దేవునకు భూదానములను గావించిరి. నంద్యాలయౌబలరాజు నందలూరు సౌమ్యనాథస్వామివారికి భూదానములను చేసెను. బొల్లవరములోని వేణుగోపాలస్వామివారికి పాపతిమ్మయదేవమహారాజుగారొక గ్రామము నిచ్చిరి. ఇమ్మడిబసవనాయడు త్రిపురాంతకదేవరకు ముప్పదితూముల మెట్టపొలమును సమర్పించెను.

ఇట్లుధనరూపకముగా నిచ్చినశాసనములు పెక్కులు గనుపట్టుచున్నవి.

పెద్దముడియము సోమేశ్వరస్వామివారి కొకొప్రభువు వసూలుచేయుసుంకములలో నొకసుంకమును సమర్పించెను.