పుట:Aliya Rama Rayalu.pdf/234

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఏడవ ప్రకరణము

రామరాయల ధర్మపరిపాలనము

కృష్ణదేవరాయలు వానితమ్ము డచ్యుతదేవరాయలు విజయనగరసామ్రాజ్యమును బరిపాలించు కాలముననే సామ్రాజ్యమున భూమిశిస్తు మొదలగునవి క్రమపద్ధతులపై స్థిరముగా నేర్పాటుచేయబడియుండుటచేత నాపద్ధతులనే సదాశివదేవరాయని కాలమునగూడ రామరాయలచే నవలంబింప బడియుండుటచేత రామరాయలకాలమున సామ్రాజ్యమున నెన్నడు నార్ధికదారిద్ర్యము సంభవించి యుండలేదు. ఆర్ధికాభివృద్ధికై యాతడెన్నడును సామ్రాజ్యప్రజలను బాధించియుండలేదు. సామ్రాజ్యమునకు లోబడినసామంతనృపతులు అమరనాయకులు మొదలగువారు ప్రతిసంవత్సరము తాము చెల్లింపవలసిన కప్పములను వరుసదప్పక సకాలమున జెల్లించు చుండుటయే తటస్థింపుచువచ్చెనుగాని యన్యధా జరిగి యుండలేదు. అందువలన ధనలోభముచే ధర్మపరిపాలనమునకు భంగము కలుగలేదు. ఇతని పరిపాలనమున ముఖ్యముగా సంరక్షింపబడినది హిందూమత ధర్మపరిపాలనమె. చక్రవర్తియగు సదాశివదేవరాయలును, వానిమంత్రియగు రామరాయలునుగూడ