పుట:Aliya Rama Rayalu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయినను దక్కనుసుల్తానులు తాము రామరాయల యసంఖ్యాక సైన్యములనుజయించుట కష్టసాధ్యమని భావించి తమతో సంధిచేసికొన్నయెడల తామదివఱకు నాక్రమించుకొన్న ప్రదేశములను మరల యాతనికిచ్చివేసెదమని రామరాయలకు దెలియ జేసిరటకాని యాతడు సంధికార్యమున కొడంబడలేదని ఫెరిస్తా తనగ్రంథమునందు వ్రాసియున్నాడుగాని యిదివట్టియసత్యమని 'హీరాసుఫాదిరి' యె యొప్పుకొనుచున్నాడు.

ఇంతలో రామరాయలు తనసైన్యములతోవచ్చి సోదరసైన్యములను గలిసికొనియెను. శత్రుసైన్యములు కృష్ణను దాటివచ్చినసంగతి దెలిసికొని రామరాయ లొకింతసంభ్రమముజెందినను ధైర్యముతో దనసైన్యములో గదనరంగమున నారితేఱినబంట్లగు రాచవారి నెల్లరను ముంగలిమునుముగా నేర్పాటుగావించి ముంగలిప్రదేశమున శత్రుసైనికులు చేరకుండ జూడవలసినదని యుత్తరువు గావించెను. అట్లే దక్కనుసుల్తానులు ఖురాసాని యాశ్వికదళముతో 'ఇఖాన్‌ఖాను' ముంగలిమునుముగా నుండునటుల యేర్పాటు చేసిరట. ఈరెండుముంగలిమునుములకు ప్రప్రథమున యుద్ధము ప్రారంభ మయ్యెననియు నీతొలియుద్ధమున ఖురాసానియాశ్వికదళము హిందూసైన్యములను దాకి పాషండుల ననేకులను మట్టుబెట్టెనని 'బురహాన్ - ఈ - మాసీర్‌' అనుగ్రంథమున వ్రాయబడియుండగా చండావర్కరుగారి 'విజయన