పుట:Aliya Rama Rayalu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శోచనీయముగ నున్నది. స్వప్నవృత్తాంతముతో గూడి నీకథ నవిశ్వసనీయమని చదువరులు గ్రహింపవలయును.

తల్లికోట కృష్ణానదినుత్తరభాగమున నిరువదియైదుమైళ్ల దూరమున నుండుటచేతను, యుద్ధము కృష్ణానదికి దక్షిణ భాగమున 'రక్షస్సు, థగిడి' యనురెండు గ్రామములసమీపమున జరిగియుండుట చేతను తల్లికోటయుద్ధ మనుటకుమారుగా 'రక్షస్థ్సగిడి' యుద్ధమని హీరాసుఫాదిరి పేర్వేట్టుట యెంతయు సమంజసముగా నున్నది.

అట్లు రామరాయ లసంఖ్యాకము లగుసైన్యములతో యుద్ధయాత్రసాగించి మున్ముందిరువదివేల యాశ్వికులతోను, వేయియేనుగులతోను, లక్షమందికాల్బలముతోను బోయి కృష్ణానదియొక్క యుత్తరపుటొడ్డు నాక్రమింపవలసిన దని తనపెద్దతమ్ము డయినతిరుమల రాయని కాజ్ఞనిచ్చి పంపెను. వానివెనుక నంతేసంఖ్యగలసైన్యముతో బోయి తిరుమలరాయనికి దోడ్పడవలసినదిగా గనిష్ఠసోదరుడైన వేంకటాద్రికి నుత్తరువుచేసి కొదువసైన్యమును దాను నడిపించుకొనిపోయెను. వీరిసైన్యములు కృష్ణానదిచేరునప్పటికే సుల్తానులసైన్యములు కృష్ణానది కుత్తరభాగమున విజయనగరసామ్రాజ్యమునకు సంబంధించిన ప్రదేశములను నాశనము గావించి కృష్ణాతీరమునకు జేరుకొనియెను. తిరుమల రాయలును, వేంకటాద్రియు దక్షిణపుటొడ్డున దండువిడిసిరి. నదిని దాటుటకు ననుకూలమైనరేవు హిందూసైన్యములచే నాక్రమింపబడి