పుట:Aliya Rama Rayalu.pdf/198

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఇక్కేఱినాయకు డయిన సదాశివనాయకుని కుమారుడు దొడ్డనంకన్ననాయకుడు జంబూరదేశపాలకు డగు విరూపణ్ణనాయకుడు సామ్రాజ్యమునకు జెల్లింపవలసిన కప్పమును చెల్లింపక శత్రుత్వమును వహించుటను సహింపజాలక వానిపై దండెత్తి వానినోడించి ఖైదిగా బట్టుకొని చక్రవర్తికి నొప్పగించెను. అందుకు సంతోషించి రామరాయలు వానిరాజ్యమును వానిసోదరుని కప్పగించి వానిని దనకొల్వు కూటమున రాజధానీనగరమున నుండ నియమించెను. అతని యాజ్ఞకు బద్ధుడై యత డట్లు గావించెను. అతనికొక్క కుమారుడు కలుగగా నాతనికి రామరా జనిపేరు పెట్టెనట. అళియరామరాయలు తనపేరు వానికుమారునకు బెట్టుటకు సంతోషించి వానిరాజభక్తినిమెచ్చి హోళెహొన్నూరు, మాశూరు, బేళమల్లూరును వానిపాలనమునకు జేర్పించుటయే గాక యాతని నాతనిరాజ్యమునకు బంపివేసెను. కాని పోర్చుగీసువారికిని సామ్రాజ్యమునకు వైరములు పొసగినందున నత్యల్పకాలములోనే వానిని సామ్రాజ్యసంరక్షణసేవకై మరల రప్పించి వానిని వానిసైన్యములను విఠలరాయనికి దోడుగా నుండున ట్లుత్తరు విచ్చివారలనిర్వురును గోవానగరమునందలి పోర్చుగీసువారిని జయించుటకై పంపెను. వార లిర్వురును గోవానగరముపై దండెత్తిపోయి యుద్ధములో వారినోడించుటయెగాక గోవాగవర్నరును బంధీకృతుని గావించి చక్రవర్తికొల్వుకూటమునకు గొనివచ్చిరి. విఠలరాయనికి