పుట:Aliya Rama Rayalu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారు కాళ్లు కదల్పలేకపోయి రట. అంతటవారికి గారణము దెలియ వచ్చెనట ! నల్లనిదుస్తులను ధరించి గాంభీర్యతను గన్పఱచెడు నొకమహానుభావుడు మాయెదుట ప్రత్యక్షమై మమ్ము చీవాట్లుపెట్టి తత్క్షణమె మరలిపొండని పలికె ననివారు చెప్పిరట ! అప్పుడు సేనాధిపతులు, అందుముఖ్యముగా విఠలరాయలు మొదలగువారువచ్చి రాజధానికి బోకుండ దారినడ్డగించినఫాదిరి ప్రాన్సిస్‌గ్షేవియరుయొక్క యాగాంభీర్య దృశ్యమును గాంచి వారుచెప్పిన దంతయు సత్యమేయని భావించి రట. అటువంటి మహాపురుషుని నోటనుండి వచ్చిన యుత్తరువు నాపరాక్రమవంతు డయినమహాశూరు డెట్లతిక్రమింప గలడు ? వెంటనే సైన్యముల వెనుదీయు డనియాజ్ఞాపించె నట ! ఈప్రకారముగా గ్షేవియరు తనప్రార్ధనలమూలమునను కోరికమూలమునను విజయనగరసైన్యముల దండయాత్రనుండి తిరువడిరాజ్యమును సంరక్షించె నట ![1]

ఇయ్యవి పోర్చుగీసుఫాదిరీల దంభోక్తులు ! వీనిని విశ్వసించి హీరాసుఫాదిరి తనగ్రంథమున నెంతోగౌరవ భావముతో నెక్కించి పయిగ్షేవియరుగారి మహిమ నంతయు లోకమునకు బ్రదర్శింపు చున్నారు. విజయనగర సేనాపతులెల్లరును మహావీరులుగాని యఱ్ఱగుడ్డను జూచి బెదరి పాఱిపోవు పసరముల వంటివారు కారు. ఇయ్యదివట్టి యసత్యకల్పనమని నిస్సంశయముగా నుడువ వచ్చును. ఇంతకు నీఫాదిరి

  1. The Aravidu Dynasty of Vijianagar, p. 143 - 144