పుట:Aliya Rama Rayalu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముఖ్యకారణము గనుపట్టుచున్నది. రాణవంశీయుడును సుప్రసిద్ధనాయకుడును, సేనాని యగుజగదేకరావు తనకుసామంతుడుగానుండియు విజయనగరపక్షమున గుట్రసాగించి తానులేనికాలమున విజయనగరసైన్యములో జేరి వేంకటాద్రితో గలిసి తనరాజ్యముపై దండెత్తి వచ్చుటయె యని తలంప నవకాశ మిచ్చుచున్నది. ఇట్లు తోరగల్లుసమీపమున ముజాహీదుఖానుసైన్యములకును, వేంకటాద్రిసైన్యములకును ఘోరమైనసంగ్రామము జరుగుచుండెను. ఇంతమాత్రమున సంతృప్తి జెందనివాడై అళియరామరాయలు తనమేనల్లుడును, కొండవీటిరాజ్యమున కధిపతియు నగుసిబ్ధిరాజుతిమ్మరాజును కొండపల్లిసర్కారు నాక్రముంచుకొనుటకై ఏబది వేలయాశ్విక సైన్యములతో బంపించె నట. మఱియొక మేనల్లు డగుజయతిమ్మరాజును ఇరువదివేలయాశ్వికసైన్యముతో దేవరకొండ, ఇంద్రకొండదుర్గములను బట్టుకొన నియమించెను. తాను తన సైన్యములతో గోల్కొండచుట్టు నున్నప్రదేశము నంతయు నాక్రమించుకొని యుండెను. సుల్తానుసైన్యములకును రాయల సైన్యములకును పోరు ఘోరముగా నుండెను. రాజమహేంద్రవరమునుండి సీతాపతియు వేదాద్రియు నేలూరుసర్కారు నాక్రమించుకొను చుండిరి. వెలుగోటిచిన్నప్పనాయుడు, వాని కుమారుడు తిమ్మానాయుడు గండికోటదుర్గము నాక్రమించిరి. ఇట్లన్నిదిక్కులను సులానుసైన్యములకును, రామరాయల