పుట:Aliya Rama Rayalu.pdf/141

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విజాపుర రాజ్యములోని కలుబరిగెదుర్గమును ముట్టడించుటకును, అందుకొఱకు దానుదోడ్పడుటకు నాతనితోనొడంబడికచేసికొని యుభయులును గలిసి కలుబరిగెదుర్గమును ముట్టడించిరి. కలుబరిగెదుర్గము సమభూమియందు నిర్మింపబడిన దయినను బలాడ్యమైనదిగ నుండెను. ఒకనెలదినములు మాత్రము దుర్గములోని సైన్యములు శత్రువులదాడిని నిలువరింప గలిగినవిగాని యటుపిమ్మట సుస్థిరముగా నిలుచుండి పోరాడుటకు శక్తిలేనివై తమదుస్థితి నంతయు సుల్తానునకు విన్నవించుచు దుర్గమును సంరక్షించుకొనవలసిన దనివర్తమానము పంపిరి. అంతనతడు తానొంటరిగ వారితో దలపడిన ప్రయోజనము లేదని తలపోసి తనకు దోడ్పడవలసినదిగా గోరుచు రామరాయలకడకు విజయనగరము రాయబారులను బంపెను. అతడు పంపినబహుమానములను గైకొని రామరాయల లశేషసైన్యములతో దానేయాధిపత్యమును వహించి ఇబ్రహీముఆదిల్‌షాకు దోడ్పడ బయలుదేఱెను. అట్లుబయలుదేఱిపోవుచు నీక్రింది జాబును గోలకొండసుల్తా నగుఇబ్రహీముకుతుబ్షాకు బంపించెనట !

"అనేక సంవత్సరములనుండి విజాపురరాజ్యమువారును అహమ్మదునగరరాజ్యమువారును దమలో దాము పోరాడుచుండెడివా రనియు, వారెదుగుబొదుగులులేక సమానబలము గలవార లయి ప్రతిసంవత్సరము వారిలో నెవ్వరో యొకరు ప్రతిపక్షమువారి సరిహద్దులలో యుద్ధమునకు సంసిద్ధులై యుం