పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౭ - మంత్రుల దుర్మరణము

85

మీ కందఱకు వినాశకాలము వచ్చినది. గోలకొండ నాశనమైపోవు కాలమువచ్చినది. మొగలాయీలు వచ్చి మిమ్ము ముక్కలుముక్కలుగా నఱకు కాలమువచ్చినది. హా! అక్కన్న మాదన్నలు మా అన్నదమ్ములు. వారుపోయిన తర్వాత మా కెందులకయ్యా ఈ రాజ్యము, ఈ యైశ్వర్యము?’

అబ్దుల్‌రజాక్ లారీ సుల్తానునకు ఊరటచెప్పసాగెనుకాని సుల్తానున కికనెక్కడి ఊరట. వెంటనే తనగురువును దర్శించెను. ఆ స్వామి వేదాంతము తప్ప ఇఁకనేమి చెపఁగలఁడు. తానాషా తన సర్దార్లతో మొగలాయీవారికి కోటనువదలివేయుఁడని చెప్పుచుండెనేగాని మానలేదు. సర్దారులు కదలక నిలిచియుండిరి. తానాషా దుఃఖాతిరేకమున నిట్లనుచున్నాఁడని వారు మొగ మొగంబులు చూచుకొనుచు మంత్రులమీఁద సుల్తానునకు ఇంతప్రేమ కలదని తమకు ఇంతవఱకు తెలియరాదాయెనని తమలోతాము చెప్పుకొనసాగిరి. తానాషా మరల నారంభించెను. ‘అక్కన్న మాదన్నలు మాకు ప్రాణము వారే మాజీవము. ఈ దేశమునకు ఎంత సేవచేసినారు! ఎంత మేధావులు! రాజ్యము విస్తరించినారు, ధనము చేర్చినారు, ఊరిని కాపాడుచున్నారు, మహమ్మదీయులతో చాలస్నేహముచేసినారు. మామీఁద వారికెంతోప్రియము. రాజ్యములు రాగలవు పోఁగలవు, అట్టి స్నేహితులు రాఁగలరా? వారిది ఎంత సమదృష్టి. హిందూముసల్మాౝభేదమే వారికిలేదు. అయ్యా! మాకు ఈ సింహాసనమిక అక్కరలేదు. ఈతక్తు, ఈరాజ్యము,