పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

అక్కన్న మాదన్నల చరిత్ర

హిందువులును బ్రాహ్మణులును నివసించు పేటమీఁద నుఱికి వేయిమంది బ్రాహ్మణులను నఱికివేసిరి. మంత్రులభార్యలు తత్క్షణమే బావులలోదుమికి ప్రాణత్యాగ మొనరించిరి. అక్కన్న కొమరుని మల్లన్నను ఆ దాది గుడ్డలలోచుట్టి ఎచ్చటికో ఊరి వెలుపలికి కొనిపోయి ఒక మూరువాఁడు, మహమ్మదీయుఁడు, మాదన్న భక్తుఁడుండ, వానికడ వదలి భానుజీకడ చేర్పుమని పలికి తాను మరలివచ్చి తనయజమానురాండ్రు దుమికిన బావిలోనే పడి మరణించెను. ఆ దినమును రాత్రియు లెక్కలేని హత్యలు జరిగినవి. మంత్రులదేహములను వీథులవెంట లాగిరి.

అక్కన్న మాదన్నలు పడిపోఁగానే నౌకరులు సుల్తాను కడకు పరుగునపోయి ఏడ్చుచు రొదచేయుచు విషయమంతయు చెప్పసాగిరి. సుల్తాను దిగ్భ్రమజెందెను. నోటమాటరాక మూర్ఛపోయెను. నౌకరులును బానిసలును పన్నీరుచల్లి సేద దేర్చిరి. అబ్దుల్‌రజాక్ మొదలైనవారు పరుగున చెంతకు వచ్చిరి. ఇంక నేమున్నది! మహామంత్రులు స్నేహితులు ఇట్టి దుర్మణము పాలయినారన్న దుఃఖము సుల్తానునకు పొంగిపొంగి వచ్చుచుండెను. ఆతఁడు పిచ్చిపిచ్చిగా పలవింపసాగెను. ఎవరేమిచెప్పినను శాంతింపలేదు. ‘కోటదర్వాజాతలుపులు తెఱచి వేయుఁడు. ఔరంగజేబునుగాని మొగలాయీవారి నెవరినైన గాని వచ్చి గోలకొండను స్వాధీనము చేసికొని పొమ్మనుఁడు. ఇఁక మాకు గోలకొండ అక్కఱలేదు. ఈ రాజ్యమును మీరే అనుభవింపుఁడు. ఎంతపాపాత్మురాండ్రు ఈ యంతఃపురస్త్రీలు.