పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

అక్కన్న మాదన్నల చరిత్ర

ఆయన మహారామభక్తుఁడని ఎఱిఁగి తనమంత్రులమీఁదనుండిన యనురాగముచే తత్క్షణమే క్షమించి భద్రాచలమునకే మర్యాదలతో పంపెను. ఈ ఘటన తానాషామీఁద మహమ్మదీయులలో కొందఱికి ద్వేషమునకును హిందువులలో అందఱికిని అభిమానమునకును కారణమాయెను.

పూర్వాచారములు మూఢవిశ్వాసములుగల ఆదినములలో ఎట్టి స్వల్పవిషయమునుగూర్చి యైనను సులువుగా కథలు అల్లుకొని పర్వుటలో నాశ్చర్యములేదు. ఇంత సులువుగా విషయము తేలిపోయినందువలన శ్రీరాములవారే తానాషాకు దర్శన మనుగ్రహించి రామదాసును చెఱవిడిపించిరని జనులు చెప్పకొనసాగిరి. మఱికొందఱు తానాషాకు పూర్వజన్మ వృత్తాంతమును సయితము కల్పించిరి. ఆయన పూర్వజన్మమున నొక దొడ్డబ్రాహ్మణుఁ డనియు గంగాతీరమున నిత్యము స్నానముచేయుచు, శివునకు గంగోదకము నభిషేకముచేసిన దేవేంద్రపదవి కలుగునని చెప్పఁగా అట్లే కొంతకాలముచేసి, ఎన్నాళ్లకును శివుఁడు ప్రత్యక్షముకాలేదని విసిగి తుదకు నీటి కుండను ఒకదినము శివలింగముపైఁ బడవేసె ననియు నంతట శివుఁడు ప్రత్యక్షమై యాతని మ్లేచ్ఛుఁడవై జనించి రాజవగుదువనియు నంతట భగవంతుని దయ కలుగుననియు వరమిచ్చెననియు నీజన్మమున తానాషా ఇంతవేదాంతిగా నుండుట కదే కారణమనియు పెక్కుకథలు బయలుదేరినవి. వాస్తవముగా తానాషా హిందువుల కంతప్రియుఁడుగా నుండెను.