పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౫ - పాదుషాతో రాయబారము

79

గారు. స్వామీ ఈదేహము నశ్వరము. దీనికై మాకు చింత లేదు. తమసింహాసనమును రాజ్యమును కాపాడుటకు వీని నర్పించుచున్నాము. గ్రహింపుఁడు. మమ్ము పంపివేసిన మేము కాశికో రామేశ్వరమునకో పోయెదము. లేదా మాప్రాణములనే గ్రహింపుఁడు.” అని తానాషా హృదయము కరఁగునట్లు పలికిరి.

తానాషా తటాలున నేడువసాగెను. అంతటిసుల్తాసు, అంతటిదొర, అంతటి వేదాంతి, పండితుఁడు సింహాసనమును వదలి, తన గాంభీర్యమంతయు అదృశ్యముకాఁగా ఆసోదరులను కౌఁగిలించుకొనెను. అబ్దుల్‌రజాకులారీకూడ కన్నీరు వదలెను. కూడనుండిన సర్దారులు పలువురు నేడ్చిరి. అక్కన్న మాదన్నలు నేడ్చిరి. “వలదు, వలదు, అంతపని వలదు. మీ ప్రాణము నాప్రాణము ఒక్కటేగాని వేఱుకావు. మేము ఏదైనను వదలఁగలముగాని మిమ్ముమాత్రము వదలఁజాలము. మీరు లేకపోయిన మాకు ఈసింహాసనమే అక్కరలేదు. ఇదంతయు భగవంతుని లీల” అనిపలికి ఎన్నికష్టములు వచ్చినను మంత్రులను స్నేహితులును వదలరాదని నిశ్చయించుకొనెను. ఆపత్కాలమున ధైర్యము వహింపవలయుననియు, తాము క్రమముగా నుపాయ మాలోచింపఁగలమనియు సోదరులు పలికి సుల్తానును వీడ్కొనిరి.

మిౝహాజ్ అత్తిమత్తరావులు మొగమొగములు చూచుకొనిరి. వారికిని దుఃఖమువచ్చినది కాని అది వేఱుదుఃఖము.