పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

అక్కన్న మాదన్నల చరిత్ర

యుండిరి. అంతఃపురమందలి పనికత్తెలుకూడ ఇందులకు సంసిద్ధలైయుండిరి. కాని ఎట్లో ఈవిషయము మంత్రులకు తెలిసి పోయినది. సుల్తానునకు వారు తెలుపఁదలఁచుకొనలేదు. కారణము ఆధ్యాత్మికదృష్టి యేర్పడిపోయినది. మహాలక్ష్మి త్వరలోనే వెడలిపోయెద నన్నదిగదా! దేశమా, గందరగోళముగా నున్నది; ప్రాణమా, తామరమీఁది నీటివలె అల్లలనాడు చున్నది. శత్రువు వాకిటికి వచ్చియున్నాఁడు. తన యైశ్వర్య మంతయు తనయెదుట కొల్లవోవుచున్నను సుల్తాను దుఃఖ పడకున్నాఁడు. ఆతఁడే వేదాంతిగానుండఁగా మనమేల అట్లుండ రాదు అని ఆసోదరులు భావించిరి. ఈ మూఁడవకుట్ర జరిగిన యనంతరము తమకు అంత్యకాలము చాల దాపైనదని తలంచి మహామంత్రు లిరువురును తమయింటఁగూడ విశేషవస్తువు లుంచుకొనక సర్వస్వము దానముచేసిరి. బంధువులను సత్కరించి దూరస్థలములకు పంపివేసిరి. భార్యలును తామును గుమాస్తాలును పరివారముమాత్ర ముండిరి. మేనల్లుఁడు, వెంకన్న (రూస్తంరావు) గోపన్నతమ్ముఁడు మాత్రము ఉద్యోగధర్మము చేత వదలలేఁడు. అక్కన్నకుమాత్రము మల్లయ్య యని రెండేండ్లకుమారుఁ డుండెనేగాని మాదన్నకు సంతానము లేదు. మల్లయ్యను దాది ఎప్పుడును ఎడఁబాయక కాపాడుచుండెను. ఇంటికడను దానధర్మములు జరుగుచుండినవి. ఇదంతయు సుల్తానెఱుఁగఁడు.