పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

అక్కన్న మాదన్నల చరిత్ర

నిట్లే జరిగెను. కొందఱు వీరులు తమశక్తినంతయు వినియోగించి పలువురు జనులను వారి ఆస్తిని కాపాడిరి. మాదన్నయు అక్కన్నయు రూస్తంరావును చాలపాటుపడిరి. మిౝహాజ్ స్వాధీనముననున్న సేన మాదన్నకు సాయపడలేదు.

తెల్లవాఱునప్పటికి మొగలాయీవారిసైన్యము హైదరాబాదునగరమును ప్రవేశించెను; మూలమూలలను సందు గొందులను ప్రవేశించి దోఁచుకొనసాగెను. బంగారము, జవాహరీ, రత్నములు, నగలు, వస్త్రములు, వస్తువులు కొన్ని వందల బండ్లకు దోపిడీ ఆయెను. రత్నకంబళములు గొప్పవి కొనిపోలేక ద్వేషముచేత వానిని కత్తులతో చించి చెండాడిరి. హిందూ మహమ్మదీయస్త్రీలను, బాలురను, బాలికలను చెఱగొనిపోయిరి. వృద్ధులను బలహీనులను నానావిధములుగా హింసించిరి. బలవంతులను కొద్దిమందిని పెక్కురు పరివేష్టించి బాధించిరి. ఇండ్లను తగులఁబెట్టరి. షాఆలము ఎంత ప్రయత్నించియు తనసేనకుపట్టిన యావేశమును మాన్పలేకపోయెను తుదకు సేనయొక్కకొత్వాలును దివానును ఇంక కొందఱుద్యోగులును ఈదోపిడిని ఎట్లో నిలిపించి వారిచేత నింకనుపడనట్టి కొన్ని కార్ఖానాలలోనిద్రవ్యమునుమాత్రము తాము హరించిరి. ఇంతలో తానాషా షాఆలంకడకు రాయబారినిపంపి మన్ననకోరఁగా నాతఁడు దోపిడి గాండ్రను శిక్షించి జనులను కాపాడెను. తగులఁబడుచుండిన యిండ్లను ఆర్పించెను. దాదాఁపు డెబ్బదిలక్షలహొన్నుల విలువ గలవస్తువులు దోపిడిపోఁగా మిగిలినవి షాఆలము చేతఁ జిక్కి