పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

అక్కన్న మాదన్నల చరిత్ర

మిౝహాజ్ తానాషాకు చెప్ప నారంభించెను. ఈమాటలను తానాషా నమ్మలేదు. తన చిరకాలమిత్రుఁడును, తనకు విశ్వాసపాత్రుఁడును మహామేథావియు ధర్మబుద్ధియునైన మాదన్న ఈరీతిగానుండఁడని తానాషా గట్టిగాచెప్పి మిౝహాజును నోరెత్తనీయలేదు.

ఇంతలో అంతఃపురమందలి స్త్రీలు తమకు హైదరాబాదు నగరములోనుండిన అపాయమనియు మొగలాయీలు బలవంతులగుటచేత నగరమునువీడి తాము గోలకొండదుర్గమును ప్రవేశించుట మంచిదని మిౝహాజ్ మొదలైనవారి దుర్బోధనలచేత ఆందోళన చేయసాగిరి. మిౝహాజ్ స్వయముగా పోయి తానాషాసుల్తానుతో నిదేరీతిని మాటలాడెను. సుల్తాను మాదన్నతో ఆలోచించెను. మాదన్న దూరదర్శి; ఆప్రకారము చేయరాదనెను. గోలకొండలో చేరుటకన్న ఓరుగంటికో కాక మఱియేదైన దూరప్రదేశమునకో పోవుట మంచిదనియు కోటను శత్రువులు ముట్టడించిన తాము బయట ధారాళముగా తిరుగుచు లోపలివారికి సాయముచేయుచు యుద్ధముచేయుట కవకాశ ముండుననియు హితోపదేశ మొనర్చెను. మిౝహాజ్ యొక్కకుట్ర మాదన్న గ్రహింపలేకపోయెను. ఇదంతయు మాదన్న దురుద్దేశమని మిౝహాజ్ చెప్పసాగెను. సుల్తాను అతనివాక్యములను నమ్మకపోయినను రాణివాసముయొక్క ప్రోద్బలముచేత గోలకొండలో ప్రవేశించెను. ఇది చాలపొరబాటే యైనను మాదన్న ప్రభువాక్యమును మన్నించెను.