పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

అక్కన్న మాదన్నల చరిత్ర

గోలకొండసైన్యములో బారిఖాౝ అనువాఁడు, తుపాకితో గుఱిగాకొట్టినట్లు ఱాతితోకొట్టు నేర్పుగలవాఁడు, ఖానీజహానును ఎదుర్కొనెను. కాని ఎచటనుండియో శత్రువులు కొట్టిన బాణమునకు కూలిపోయెను. ఒకపర్యాయము మొగలాయీవారు తామోడిపోవుటకు సిద్ధముగానుండు సమయమున రాజా రామసింగ్ అనువాని యేనుఁగును ఉసికొల్పి శత్రువుల నడిమికి త్రోలిరి. అది తనదంతములకు కట్టియుండిన మూఁడుమణుగుల బరువుగల ఇనుపగొలుసును ఇటునటుకొట్టుచు పరుగిడి తటాలున రాఁగా గోలకొండవారి గుఱ్ఱములు బెదరి రౌతులనుత్రోసి చిందరవందరగా పాఱిపోయినవి. మొగలాయీవారికి జయమబ్బినది. ఈవిధముగా ఒక్కొక్కయుద్ధముచేతను వారిపురోగమనము మూఁడు నాలుగుదినములు ఆలస్యమగుచు వచ్చినది.

ఇంతలో ఆగస్టునెల వచ్చెను. ఎడతెంపులేని వానలచేత మొగలాయీలు కష్టపడఁజొచ్చిరి. వారిగమనము చాల మందగించినది. ఇంతలో గోలకొండవారు ఆయత్తపడఁజొచ్చిరి. మాదన్నపంతులుగారి సొంత గుఱ్ఱపుదండు, పదివేలస్తోమము వచ్చి యుద్ధరంగమును ప్రవేశించెను. జాౝనిసార్‌ఖాను సెడంలోని మట్టికోటలో చేరఁగా గోలకొండఫౌజు వారిని ముట్టడించినదిగాని మొగలాయీలు ధైర్యముగా కోటను కాపాడుకొనిరి. ఈ నిత్యయుద్ధములలో ఇరుపక్షములలోను లెక్కలేనివారు చనిపోవుచుండిరి. మొగలాయీలకు దినమంతయు ఘోరముగా పోరాడినందున సాయంకాలమునకు జయమబ్బినను అలసి