పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౨ - మొగలాయీలతో ఘర్షణ

65

మరలి అచటినుండి యుద్ధముచేయ నారంభించెను. గోలకొండ సైన్యములు తమ యనుకూలములను చూచుకొని అనుదినము శత్రువులను కొట్టుచుండినవి. గోలకొండసైన్యములు గొప్పవగుటచే ఖానీజహాను తన స్కంధావారముచుట్టును ప్రాకారము లేర్పఱచుకొనుచు మాన్యఖేటమునందే యుండి ముట్టడింపఁ బడినవానివలె నాయెను. శత్రువుల నెదుర్కొని యుద్ధము చేయుట కష్టమని ఆతఁడు దుర్గము నిర్మించుకొని ఆత్మరక్షణ ప్రయత్నములు చేయసాగెను. ఒకయడుగైనను ముందునకు సాగుటకు లేకుండెను. తర్వాత కొంతకాలమునకు చక్రవర్తి కుమారుఁడు షాఆలం వచ్చిచేరెను. ఇంతలో యుద్ధతీవ్రత తగ్గెను. తానాషావచ్చి ఢిల్లీపాదుషాకు పాదాక్రాంతుఁ డైన యెడల తా నాయనకుచెప్పి తానాషాను క్షమింపింతునని షాఆలం రాయబారము పంపెను. విజయము తమదైయుండుటచే ఈమాటలను తెలంగాణమువారు పరిహసించి తిరస్కరించి వేసిరి. ఉత్తరప్రత్యుత్తరములతో కొంత కాలము గడచెను.

మొగలాయీలు మాన్యఖేటమున తమ సామానులను చేర్చుకొని తమ సేనాముఖమును ఖానీజహాను నేతృత్వమున హైదరాబాదునకు మార్గము కనిపట్టుటకు పంపిరి. ఈసైన్యమునకు మూఁడింతలసైన్యమువచ్చి ఎదుర్కొనెను. మొగలుసైన్యములో హిమ్మత్‌ఖాను, సయ్యద్ అబ్దుల్లాఖాౝ అను వారల క్రింద సైన్యములు మొండిపట్టుపట్టి పోరాడుచు ప్రతిదినము సాయంకాల మగుసరికి గోలకొండవారిని జయించుచుండినవి.
5