పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౯ - శివాజీ తానాషాను దర్శించుట

45

అక్కన్న మాదన్నలు శివాజీతోకూడ నాతని విడిదలకేఁగి ఆతని కచట అన్నియేర్పాటులును చేయించి మరల సాయంకాలము వత్తుమనిపలికి వీడ్కొలిపిరి. తానాషాను వారు వచ్చి మరల దర్శించిరి. శివాజీసందర్శనమునకు అందఱును చాల సంతోషించి మాదన్నను మెచ్చుకొని శివాజీరాయబారిని శ్లాఘించిరి. శివాజీసౌజన్యమునకు తానాషా సంతోషించెను.

ఆమఱునాఁడు అక్కన్నమాదన్నలయింట శివాజికి విందు ఏర్పాటాయెను. వైభవముతో మహామంత్రులు శివాజిని ఆతని ముఖ్యవర్గమును తమ భవనమునకు కొనిపోయిరి. ఆ బ్రాహ్మణగృహమును శివాజి పావుకోళ్లులేకయే ప్రవేశించి భానూజీ భాగ్యమ్మలకు సాష్టాంగముగా నమస్కరించి ఆ వృద్ధ దంపతులచేత దీవనల నంది వారికోర్కిమీఁద వారియెదుట వారమర్చిన తివాసిపై కూర్చుండెను. కొంతసేపు భానుమూర్తి పంతులు మహారాష్ట్రభాషలో శివాజిని వినోదించెను. శివాజిని తెచ్చి అతనిచేత తనకు మ్రొక్కించిన కొమాళ్లపై ఆయనకు చెప్పరానిసంతోషము. కొంతసేపైనతర్వాత భానూజిపంతులు శివాజికి స్నానాదికముల కేర్పాటుచేయించి మడిగా నాతని పూజాగృహమునకు కొనిపోయి ఆశీర్వదించి భగవత్ప్రసాద విుప్పించి, బ్రాహ్మణసంతర్పణ యైనవెనుక భోజనాదికమున కేర్పాటు చేయించెను.

సేవకులు, పరిచారకులు, వంటవాండ్రు, శివాజిపరివారమును చూచుకొనుచుండఁగా భానూజీ భాగ్యమ్మలు మర్యా