పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

అక్కన్న మాదన్నల చరిత్ర

తానాషా ఆనందముతో వినుచుండెను. సభ్యులవర్ణనలకు తనివిఁజెందక శివాజీ ‘ఈక్షామదేవతలు సరిగావర్ణింపలేరు’ అన్నట్లు తానే వర్ణింపసాగెను. ఎట్లు తాను అఫ్జల్‌ఖానును కడతేర్చినదియు, ఆతఁడు ద్రోహమెంచిరాఁగా తా నందులకొనర్చిన ప్రతిక్రియయు, తనది ద్రోహము కాదనియు విరివిగా నుద్ఘాటించెను. తర్వాత తానాషా ఔరంగజేబునుగూర్చి ప్రస్తావింపఁగా శివాజీ, పాదుషా నీచుఁడనియు, తనకు మొగలాయీలు తామొనర్చిన వాగ్దానాదికములను నెఱవేర్పక అల్పులుగా ప్రవర్తించిరనియు, సభలో తా నెట్లు పాదుషాను ధిక్కరించి వెడలివచ్చినదియు, తర్వాతిఖైదును, ఆఖైదునుండి తాను తప్పించుకొనినవిధమును, ఆవచ్చుటలో జరిగిన విశేషములను కథగా చెప్పెను. తర్వాత తాను సూరత్తును కొల్లగొట్టినదియు, దుర్గములను కూల్చినదియు, మొగలాయీవారిని ఏడిపించినవిధమును వర్ణించెను. ఆవిధముగా చాలసేపు మాటలాడిన ఛత్రపతికి తానాషా ఆభరణము లొసంగి వస్త్రాదికములిచ్చి గుఱ్ఱములు, ఏనుఁగులు మున్నగు వాహనాదికములిచ్చి విశేషముగా గౌరవించెను. తానాషా కనుసన్నచే మాదన్నయు అతనియనుచరులును శివాజీ పరివారమునకు తగినమర్యాద లొనర్చిరి. సభ లేవఁగానే తానాషా శివాజీపై అత్తరుపన్నీరు మొదలైన సువాసనలు చల్లి తాంబూల మొసంగి స్వయముగా మెట్లవఱకును వచ్చి విడిదికి సాగనంపెను. శివాజీ విడిదికి పోవుచు మరల మార్గమంతయు డబ్బులు చల్లుచుపోయెను.