పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము 9 - శివాజీ తానాషాను దర్శించుట

43


లును గోలకొండప్రధానులు మఱికొందఱును వెంటరాఁగా నగరులోనికి పోయిరి. అచట నొక ప్రాంగణమున గుఱ్ఱములు దిగి విశాలమైన యాస్థానమంటపమునకు మాదన్న శివాజీని తోడ్కొనిపోయెను. అనుచరులు ఒకయడుగు వెనుక రాఁ దొడఁగిరి. లోనప్రవేశింపఁగానే తానాషాయును అతని యనుచరులును ఎదురువచ్చిరి. తానాషా శివాజీని కౌఁగిలించుకొని తనప్రక్కన రాజోచితమైన రత్నకంబళముమీఁద జలతారంచు పట్టుదిండ్లకు ఆనుకొనునట్లు కూర్చుండఁబెట్టుకొనెను. సుల్తానును శివాజీయు కూర్చుండఁగానే సుల్తానుసైగచే వారిప్రక్కనున్న మహామాత్యుడు మాదన్నయు మహాప్రచండదండనాయకుఁడు అక్కన్నయు కూర్చుండిరి. మిగిలినవారందఱును నిలువఁబడియే యుండిరి. లోపలనుండి సన్నని కంతలగుండ అంతఃపురస్త్రీలు ఈవేడుకలు చూచుచుండిరి. శివాజీ యంతటివాఁడు ఇంట ప్రవేశించుట యనఁగా నాగుబాము సాధువై మనప్రక్కవచ్చి కూర్చుండుట వంటిదిగాను, ఆనాగమును అట్లు కొనివచ్చినమాంత్రికుఁడు మాదన్న యనియు వారు తలంచుచుండిరి.

మూఁడుగంటలసేపు శివాజీ తానాషాలు గోష్ఠిసలిపిరి. మొదట పరస్పరము ఆచారోపచారములు కుశలప్రశ్నలు మొదలైన మామూలుకార్యక్రమము జరిగినది. తర్వాత శివాజీ కావించిన మహత్కార్యములను గుఱించియు నాతని ధైర్యసాహసములనుగుఱించియు సభ్యు లుద్ఘోషించుచుండఁగా