పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
36
అక్కన్న మాదన్నల చరిత్ర

పాదుషా పంజాబులో యుద్ధ మొనరించి ఢిల్లీకి వచ్చియుండినను ఆతనిసైన్యము లింకను పంజాబునం దేయుండెను. బిజాపూరు సుల్తాను సికందరు బాలుఁడు. అందుచేత వజీరుపదవికి అంతఃకలహములును హత్యలును జరుగుచుండినవి. భలోల్ ఖాన్ అను నతఁడు క్రొత్త మంత్రియాయెను. మొగలాయీలు మఱియెుకని మంత్రిత్వమునకు సహాయము చేయఁగోరి బిజాపూరువిూఁదికి దండెత్తిరి. కాని వారిసైన్యము లింకను రాలేదు.

ఇట్టిసమయమున మాదన్న బిజాపురమును రక్షింపనెంచెను. భలోలుఖాను శివాజీతో స్నేహముకోరెను. మాదన్న కోరినదియు నదియే. వెంటనే మాదన్న శివాజీతో భలోలు ఖానునకు సంధి కుదిర్చెను. భలోలుఖాను బిజాపురమువారితరపున శివాజీకి మూఁడులక్షలరూపాయలు బహుమతిగా నిచ్చుటకును, తమ తూర్పువైపు కృష్ణాతీరపుటెల్లను కాపాడుటకును మొగలాయీలను తఱుముటకును లక్షహొన్నులు, (బంగారు నాణెములు) ఏటేట ఇచ్చుటకును మాదన్న మాటమీఁద ఒప్పుకొనెను. ఈసందర్భమున శివాజీ ఉత్తరమునుండి తనకెట్టి ఆపదయు రాదని గ్రహించెను. ఈకట్టుబాట్లను ఎక్కువ కాలము జరుపవలయునని ఆతనియుద్దేశము కాదు గాన తాత్కాలికముగా అనుకూలమని ఆతఁడు ఒప్పుకొనెను. నిలుకడలేని బిజాపూరు ప్రభుత్వముతో ఎట్టిస్నేహమును చాలకాలము జరుగదని ఆతఁడు ఆలోచించెను. బిజాపూరువా రిచ్చిన ధనమును మాత్రము గ్రహించెను.