పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౬ - మాదన్న పరిపాలనాప్రారంభము

31

ఆడిల్‌షాతోను యుద్ధము చేయుచుండినందున గోలకొండపై దాడి సలుపుటకు అవకాశము దొరకలేదు. పైగా గోలకొండ వారు ఢిల్లీకి సక్రమముగా కప్పము కట్టుచుండిరి.

గోలకొండ రాజ్యమునకు సరియైన రక్షణ లేదు. దాని యుత్తరభాగము మొగలాయీలు జయించిన రాజ్యమును ఆనుకొనియున్నట్టి విశాలమైన బయలు. దానియందు బిజాపురము యొక్క రక్షణకున్నట్లు దుర్గమపర్వతములుగాని, నీరు దొరకని ఎడారిగాని మఱియెట్టి నైసర్గిక నిరోధముగాని లేకుండెను. కాని ఎంతకాలము బిజాపూరు స్వతంత్రరాజ్యముగానుండునో అంతవఱకు గోలకొండకు అపాయములేదు. ఈవిషయమును చక్కఁగా నెఱిఁగినవాఁ డగుటచే నౌరంగజేబు పాదుషా, గోలకొండను మొదటజయించి తనసామ్రాజ్యమందు కలుపుకొనుటకు యత్నింపలేదు అట్లుచేయుటయు అసాధ్యముగానుండెను.

మాదన్న పంతులు కొలఁదిమార్పులతో తత్పూర్వము గోలకొండవా రనుసరించుచుండిన విదేశాంగనీతినే యనుసరించెను. క్రీ.శ. 1636 వ సంవత్సరము నైజాముషాహిరాజ్యము పడిపోయినది. అదిమొదలు ఎట్లు ఈ మొగలాయివారిని తప్పించుకొందుమా యను భీతి దక్షిణరాజ్యములకు పట్టినది. గోలకొండవారికిని అదేభయము. అందుచేతనే గోలకొండసుల్తానులు మాటమాత్రమునకు ఢిల్లీపాదుషాకు వశపడియుండిరే గాని వాస్తవముగా, లోలోపల, బిజాపూరు ఆడిల్‌షాహివారికి ధనసహాయము చేయుచుండిరి; మొగలాయీలు బిజాపురము