పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౪ - అక్కన్న మాదన్నల స్వప్నములు

23

నుండెను. నాకు ఆశ్చర్యముతో నేమియు తోపలేదు. మాదన్న నాప్రక్కనే యుండెను. ఆభక్తకోటిలో తానాషాకూడ కనఁబడుచుండెను. ఈ మహమ్మదీయుఁ డెట్లు గర్భాలయములోనికి రాఁగలిగెనని నా కాశ్చర్యమాయెను. మాదన్నవైపు చూచితిని. ఇంతలో నాతఁడు ‘చూడు, చూడు, అన్నయ్యా అమ్మవారు పిలుచుచున్నది’ అనెను. అటు చూతునుగదా భక్తులుగాని తానాషాగాని ఎవరును లేరు, భవానీదేవిమాత్రము కనఁబడుచుండెను. ‘అక్కన్నా, ఇంద, ఈకరవాలము గ్రహింపుము, మాదన్నా ఈ పాశము నీకు. మీకు మేలగుగాక’ అని అంతర్ధానమాయెను. ఆస్వప్నము తమ్మునికి కూడవచ్చినది.

మాదన్న―ఔనండి, మా యిరువురి స్వప్నములును ఒకటే. మేము ఏకకాలమున మేలుకొని ఒకరినొకరము చూచుకొని కొంతసేపుండి తర్వాత స్వప్నవృత్తాంతములను చెప్పుకొంటిమి. ఏమాశ్చర్యము!

భట్టు ― ఆహా! దివ్యమైనకల. స్వప్నశాస్త్రములో చెప్పినట్లు మూఁడవజామునవచ్చినకల మూఁడు నెలలలో ఫలమిచ్చును. మీకు ఈవసారత్‌నౌకరి మూఁడునెలలుమాత్రమే. తర్వాత, అక్కన్నా, నీకు మహాసేనాధిపతి పదవియు, మాదన్నా, నీకు మహామంత్రిత్వమును లభించును. అమ్మవారి ప్రసాదము వృథాపోదు. భక్తకోటిలో మీకు తానాషా కనఁబడుటచే నాతఁడు మహాభక్తుఁడనియు, గొప్పవేదాంతి యనియు, మహమ్మదీయుఁడేయైనను పూజ్యుఁడని తెలిసికొనవలయును.