పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

అక్కన్న మాదన్నల చరిత్ర

ఈతనియొక్కయు ముజఫరుయొక్కయు రాజనీతిచే గోలకొండ సామ్రాజ్యము మొగలాయీలకు లోజిక్కక దాదాఁపు అర్ధశతాబ్దము తప్పించుకొనెను. కాని రాజ్యవినాశము ఎట్లును తప్పనట్టి పరిస్థితి రాఁదొడఁగినది. అబ్దుల్లా దుర్బలుఁడు; తనజీవితమంతయు సోమరిగా గడపెను. క్రీ. శ. 1656 వ సంవత్సరమున నీతఁడు ఔరంగజేబు చేతఁబడక కొంచెములో తన ప్రాణములను కాపాడుకొనెను. ఇతఁడెప్పుడును ప్రజలకు దర్శనమిచ్చుటగాని దేశాచారముల ననుసరించి ధర్మాధర్మములను విచారించుట గాని లేదు. కోటగోడలను దాఁటి ఇవలికి వచ్చుటకు అధైర్యపడుచుండును. అందుచేత దేశమందు కల్లోలములును అరాచకమును సహజముగా తప్పనివయ్యెను.

రాచనగరునందును పరిస్థితులు ఇంతకన్న చక్కఁగా లేవు. రాజకుటుంబమునందు అంతఃకలహము లేర్పడుచుండినవి. సుల్తాౝ అబ్దుల్లాకు మువ్వురు కుమార్తెలు మాత్రమే, పుత్త్ర సంతానములేదు. మొదటియల్లుఁడు పైన పేర్కొన్న సయ్యద్ అహమ్మద్. రెండవయల్లుఁడు ఢిల్లీ పాదుషాఔరంగజేబు రెండవ కొమారుఁడు. వీరిలో అహమ్మద్ మక్కాకుచెందిన యొక గొప్ప కుటుంబములోజనించి కేవలము తన స్వశక్తిచేతనే రాజ్యమందు సర్వాధికారిగా నుండెను. సుల్తానుయొక్క మూఁడవకొమార్తెకు వివాహము కావలసి యుండెను. ఈమెను అహమ్మదు తన యాశ్రితునికే సయ్యద్‌సుల్తాన్ అను వానికిచ్చి పెండ్లిచేయుట కేర్పాటుచేసెను. ఇంతలో ఈయిరువురకును బెడిసి ద్వేషమేర్పడి