పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౨ - తానాషా దర్బారు

13


వూరుమీఁద మొగలాయీలు బలముగ యుద్ధసన్నాహములు చేయుచున్నారు. బిజాపూరు పడిపోయిన మనవంతు తప్పదు. చాల జాగ్రత్త వహింపవలయును.

తానాషా ― ఔను. విూమాట నిజమే. ఔరంగజేబు మనయాంధ్రదేశమును మ్రింగవలయునని యున్నాఁడు. మా సర్దారులు బుద్ధిలేక తమలో తాము జగడ మాడుచున్నారు. కానిండు ఆలోచింతము.

మాదన్న ― మహాప్రభువు గారితో పదిమాటలేల ? మేము తమ చిత్తమునకువచ్చునట్టి నౌకరులము.

తానాషా ― అచ్ఛా. అదే మాకు కావలెను. ముందు ఆలోచింతము. ఇప్పుడు ఈజాబునకు బదులుజాబు తయారు చేయుఁడు.

మాదన్న వెంటనే తన చొక్కా జేబునుండి ఏదోపొడి తీసి నీటిలోరంగరించి ఆసిరాతో మఱియొక కాగితముపైవ్రాసి పాదుషాకు జవాబు తయారుచేసి సుల్తానునకు చూపెను. తానాషా సంతోషించి దర్బారులోనికి వచ్చెను. అక్కన్న మాదన్నలు పరమానందభరితులై ఒకరినొకరు చూపులతో మాత్రమే హెచ్చరించుకొనుచు సుల్తానువెంట దర్బారులోనికి పోయిరి.

మొగలాయి రాయబారిని చూచి, తానాషా― ‘రాయబారిభాయి ఇదుగో తమకు జవాబు. విూరు దీనిని పాదుషా వారికి అందఁజేయుఁడు’ అనెను.