పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

అక్కన్న మాదన్నల చరిత్ర

తానాషా ― అచ్ఛా, అటులైన మా‘కులయత్ ఖానా’కు పోదము. అని లేచెను. కులయత్‌ఖానా యనఁగా నాంతరంగిక గృహము. సుల్తాను అక్కన్నమాదన్నలు అంగరక్షకులును మాత్రమే మేడమీఁదికి పోయిరి. ముజఫరునకు నెత్తిన పిడుగు పడినట్లు ఆయెను. తన గుమాస్తాలేమి సుల్తానుతో అంతరంగిక గృహమున ముచ్చటించుటయేమి! ఈయువకులకు జరుగు ఈమర్యాదయంతయు నాతనికి కనుకుట్టుగా నుండెను. తనకుకూడ వెంటపోవలయునని కోరిక యున్నదిగాని సుల్తాను యొక్క ఆజ్ఞలేనిదే పోరాదు. ఈయావేగమునకు కారణము మున్ముందు తెలియును.

కులయత్ ఖానాలో ప్రవేశించిన వెంటనే మాదన్న ― ‘జగత్ప్రభూ తమకొక వేడుక చూపెదము’ అని, నౌకరును చూచి ‘ఒక గళాసునీరు’ అనెను. నీరురాఁగా ఆకాగితముపై చల్లెను. వెంటనే నల్లనియక్షరములు కనఁబడసాగినవి,

తానాషా ― ఏమి యాశ్చర్యము! అక్షరములున్నవి, కనఁబడుచున్నవి.

మాదన్న ― వట్టి క్షేమసమాచారము. ప్రభూ ఇది తెల్లసిరావ్రాఁత, అందుచేత తెలియలేదు. దీని రహస్యము మాతండ్రిగారు మాకు చిన్నప్పుడే బోధించినారు. ఆలంఘీరు పాదుషా దీనిని పంపుటలో గోలకొండ దర్బారులో ఎటువంటివా రున్నారని పరీక్షించు నట్లున్నది. మహాప్రభూ మన రాష్ట్రమునకు వారివలన ఉపద్రవము ఎన్నటికైన తప్పదు, బిజా