పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౨ - తానాషా దర్బారు

9

మును నెత్తిన తిలక్‌టోపీవంటి టోపియు, మొగమున గీరు నామములును. వారు దూరమునుండియే మోకాళ్లపైనిల్చి సుల్తానునకు సలాములు చేసిరి. ముజఫరు సలాముచేసి, ‘జగద్రక్షకా, వీరే ఆతెలంగీ పంతుళ్లు’ అని విన్నవించెను. సుల్తానునకు వారినిచూడఁగనే ఏదో చెప్పరాని యానంద మేర్పడిన ట్లుండెను; వారిని చెంతకు పిలిచెను. చూపులోనే భావము గ్రహించిన ఆసోదరులు సింహాసనము చెంతకు పోయి నిలిచిరి. మరల సలాములు చేసి వినమ్రులై నిలువఁబడిరి,

తానాషాసుల్తాను వారిని నిదానించి చూచి ఇట్లనెను― ‘మీసామర్థ్యమును గుఱించి మేము ఇప్పడే విన్నాము. ఇంత చదివినవారు మాదర్బారులో ఉండవలెను. మంచిది. ఎవరురా, ఆ ఇనయత్‌నామా తెండి.’ అని పాదుషా పంపిన జాబును తెమ్మనెను. ఇంతలో తానాషావారిని ‘విూ పేరేమి?’ అని యడిగెను.

యువకులు ― మహాప్రభూ, క్షమింపవలెను, మాహిందువుల యాచారము, ఎవరును తమపేరు తామే చెప్పుకొనరాదు.

తానాషా ― సెభాష్. అది మీసంప్రదాయము.

ముజఫరు ― ఈయన అక్కన్న పంతులుగారు, ఈయన మాదన్న పంతులుగారు,

తానాషా ― అచ్ఛా చాలసంతోషము. అన్నదమ్ములు ఒక్కపోలికగా ఉన్నారు.