పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్కన్న మాదన్నల చరిత్ర

ప్రకరణము ౧ - దండోరా

“హిందువుగాని మహమ్మదీయుఁడుగాని, ఎవఁడైనను ఈ కాగితమును చదివి ఇందులోని విషయమును విశదీకరించు వానికి అబుల్‌హసౝ తానాషాసుల్తాౝబహద్దరువారు గొప్ప యుద్యోగమిచ్చి చాలగౌరవము చేయఁగలరు. ఎవరైనను చదువఁగలిగినవారు వచ్చి చదువవచ్చును.” అని గోలకొండ పట్టణము వీథులలో నొకదినము దండోరా వినవచ్చుచుండెను. వెట్టివాఁడొకఁడు డప్పువాయించు చుండఁగా, తెల్లని, అక్షరములు కనఁబడని, కాగితమును చూపుచు నతనివెంట రాజభటులును వారితో నొక యుద్యోగస్థుఁడును పోవుచుండిరి. ఆ కాగితమును చూచి అదేదోహాస్యమని కొందఱు నవ్వుచుండిరి. కొందఱు అందేమో వాస్తవముగా విశేషము కలదని చూచుచుండిరి. వీథులలో నిదియొక వేడుకగానుండెను.

ఈతెల్లని కాగితము ఔరంగజేబుపాదుషా గోలకొండ సుల్తానునకుపంపిన ‘ఇనయత్‌నామా’ అనఁగా కుశలప్రశ్నలు వేయుజాబు. పాదుషాయెుక్క రాయబారి అంతకు మూఁడు నెలలక్రింద దానినితెచ్చి గోలకొండసుల్తానైన తానీషా (తానాషా) గారికిచ్చి జవాబుకోరియుండెను. అది అక్షరములు లేని తెల్లని కాగితము. ఐనను చదువుఁడని తానాషా తన వజీ