పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౨౪ - అబ్దుల్‌రజాక్‌లారీ బ్రదుకుట

123

అలంఘీరు పాదుషాకు పాదాక్రాంతుఁడై నౌకరి చేయఁడని మాత్రము దృఢముగా నమ్ముఁడు” పాదుషాకు ఈవాక్యములు వ్యథ కలిగించెను. కాని కొంతకుకొంత ధార్మికుఁడుగాన రజాకునకు త్వరలో ఆరోగ్యము చేకూర్పుఁడని వైద్యులను హెచ్చరించెను. రజాక్‌యొక్క ఆస్తిలో కొల్లపోఁగా మిగిలిన దాని నంతయు నాతని కిప్పించెను. ఆతఁడు సంపూర్ణారోగ్యమునందినంతనే ఓదార్చి పాదుషాకడకు తెమ్మని హైదరాబాదు సుబేదారుని కుత్తరువాయెను. సుబేదారాతని చేతికి సంకిళ్లు తగిలించి కొనిపొమ్మనెను గాని ఖాౝబహదూర్ ఫిరోజ్‌జంగు అడ్డుపడి ఆయవమానమును నిలిపి తనకడ కొన్నిదినము లుంచుకొని నామకార్థమైనను పాదుషాకొలువును ఒప్పుకొమ్మనెను. రజాకు పాదుషాను దర్శించుటకు మాత్రమొప్పుకొనెను. పాదుషా రజాకును చాలగౌరవించెను.

పాదుషా ― అబ్దుల్‌రజాక్‌సాహెబ్, మీరు చాల గొప్పవారు. ఇంత స్వామిభక్తి, సాహసము, మత గౌరవమును చూపినవారిని మేము ఎక్కడను చూడలేదు. మీకు ఏమి కావలెనో కోరుఁడు, మేము చేయఁగలము.

రజాక్ ― భగవంతుని దయవలన నాకు చావు ఒకటే మిగిలియున్నది. ఇఁక నేమియు నక్కఱలేదు.

పాదుషా ― పోయినదేవెూ పోయినదిగదా. మాతరఫున ఈగోలకొండలో నవాబుగా నుండుఁడు.