పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౨౩ - తానాషా కడపటివిందు

117

లకై ఎదురుచూచు వానివలె దర్పముతో నుండెను. భోజన సమయమైనంతట త్వరగా అన్నపానముల కాజ్ఞాపించెను. ఇంతలోపల రుహుల్లాఖాౝ ముక్తారుఖానులు ఇద్దరుసర్దారులతోను కొందఱు గొప్పవారితోను వచ్చి తానాషాను చూచిరి. ఆ క్లిష్టపరిస్థితిలో కూడ ఆస్థానభోగమును వీడక సింహసనము మీఁదనుండిన యాప్రభువును చూచినంతనే వారిధైర్యము తగ్గెను. ఆతనితేజమే వారిని కొట్టున ట్లుండెను. ఇంకకొంత సేపటికి ఖైదుసేయఁబడువానివలె నాతఁ డుండలేదు. ఆచింత యే లేనివానివలె నుండెను. మొగలాయీ సర్దారులు ఆతనికి సలాములు చేసిరి. అతఁడు వారికి తనరాచఠీవి యంతయు కనఁబడునట్లు బదులు సలాముచేసెసు. వారినందఱను ప్రత్యేకముగా హెచ్చరించుకొని మర్యాదచేసి గంభీరముగ స్వాగతము పలికెను.

ఇంతలో నొక సేవకుఁడు వచ్చి తానాషాకు భోజనము సిద్ధమైయున్నదని విన్నవించెను. వెంటనే సుల్తాను తనకు భోజనమునకు వేళయైనదని వారితోచెప్పి వారినికూడ తనతో విందారగింప పిలిచెను. కొందఱు దుర్జనులు తానాషాను అటనుండి పోనీయరాదని పలికిరి. కాని మొగలాయీసర్దారులు ఆలోచించి ఇట్లుచేయుటలో తప్పులేదనితలంచి ఒప్పుకొనిరి. ముక్తార్ ఖానును మఱియొకఁడును తానాషాతో భోజనమునకు కూర్చుండిరి. రుహుల్లాఖాను ఆశ్చర్యపడి ‘ఇది భోజనానికి సమయమా’? అని యడిగెను. తానాషా ఆతనిహృదయమును