పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

అక్కన్న మాదన్నల చరిత్ర

రించివేసి యుండిరి. మొగలాయీ సిబ్బంది యంతయు మొగము వ్రేలవేసికొని వెనుదిరిగి పోయెను. ఫిరోజుజంగునకు రెండు బాణములుతగిలి మంచి గాయమాయెను. ఇంక ననేకులకు దెబ్బలు తగిలినవి. కోట పట్టుపనిని పాదుషా తనకుమారుఁడు ఆజంషాకు ఒప్పగించెను.

తర్వాత కొన్ని దినములవఱకు తానాషాసైన్యములు మొగలాయీలను డీకొనలేదు. వారును కోటను పట్టుటకు రాలేదు. కొందఱు సర్దారులు పాదుషా కడకుపోయి హైదరాబాదు మొదలైన ప్రధాన నగరములను పట్టుకొని దేశమును స్వాధీనము చేసికొనినయెడల తానాషా కొన్నాళ్లు కోటలోనుండి పోరాడి తుదకు ఆహారములేనందున వశపడునని మనవి చేసిరి. వెంటనే పాదుషా కొందఱు అధికారులను ప్రధాన ప్రదేశములకుపంపి తనజాబులలోను కచేరీ కాగితములమీఁదను ఫర్మానాలలోను దరఖాస్తులయందును హైదరాబాదనుపేరు వ్యవహరింపక దానికి దార్-ఉల్-జిహాద్ అని క్రొత్తపేరు వ్రాయవలయునని యాజ్ఞాపించెను. అబ్దుల్‌రహీం ఖానను వానినిపన్నులు మొదలైన వసూలుపనులయందు నియమించి మహమ్మదీయేతరుల యాచారవ్యవహారములను వేటిని సాగనీయక దేవాలయములను కూల్పించి మసీదులు కట్టుట కేర్పాటుచేసెను.