పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౨౧ - మరల ముట్టడి ప్రయత్నములు

109

మంది కాలిచిచ్చిరి. గోడలో కొంతభాగము కూలినందున అగడితకును దానికి నడుమ చాలమంది సమాధినందిరి. కోటమీఁదివారికి అపాయము తక్కువ. మొగలాయీలు చచ్చిన వారిసంఖ్య 1098 అని లెక్క తేలినది.

తా వెుదురుచూడనివిధమున అందఱు చనిపోయినందులకు మొగలాయీవారికి మతి పోయిన ట్లాయెను. తుపాకి మందువలని పొగయు దుమ్మును స్కంధావార మంతటిని ఆక్రమించి అంధకార బంధురముగా చేసెను. గోలకొండవారు మొగలాయీలగోడును చూచి తత్క్షణమే సన్నాహముతో పాదుషావారి సైన్యము మీఁదపడి వారిమోర్జాలను కొన్నిటిని పట్టుకొనిరి. పాదుషా కీ విషయము తెలియఁగానే గోలకొండవారిని దండింప నాజ్ఞాపించెను. ఘోరయుద్ధమై చాల జననాశమైన తర్వాత మోర్జాలను మరల మొగలాయీవారు నిలుపుకొనఁగలిగిరి. ఇంతలో పాదుషా రెండవ సొరంగమునకు నిప్పంటింప నాజ్ఞాపించెను. వెంటనే కోటలోపలనుండి కొన్ని వేల రాళ్లు బండలు పక్షులవలె రివ్వురివ్వున వచ్చి లెక్కలేని మొగలాయీల తలలనుకొట్టగా వారి ఏడ్పులును రొదలును మిన్నుముట్టుచుండినవి. ఈమాఱు మొగలాయీలు రెండువేలయేడుగురు మరణించిరి. మరల కోటలోని పౌజు బయలు దేరివచ్చి మోర్జాలను పట్టుకొన యత్నించినవి. ఫిరోజుజంగు స్వయముగా వచ్చి ఘోరయుద్ధము చేసినను గోలకొండవారు తగ్గలేదు. ఆఱుగురు మొగలాయీవీరులు మరణించిరి.