పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౨౧ - మరల ముట్టడి ప్రయత్నములు

107

అబ్దుల్‌రజాక్‌లారీ తాను ఖైదు పట్టుకొనిపోయిన యా మొగలాయీ సర్దారులను తానాషాకడకు కొనిపోయెను. గోలకొండసుల్తాను వెంటనే వారికి సేదదేర్చుకొను సదుపాయములు చేయించి మూఁడుదినములు తనకడ నుంచుకొని చక్కని భోజనాదికము లొడఁగూర్చి మర్యాదచేసి వారి చిత్తవిశ్రాంతి తీర్చెను. గొప్పదుస్తులిచ్చి తాను నిలువయుంచుకొనియుండిన ధాన్యమును, తనకడనుండిన తుపాకిమందును యుద్ధపరికరములనుచూపి, తనకు కావలసినదానికన్నను హెచ్చుగా వస్తు సంచయము కలదనియు కోటవదలననియు నొకజాబువ్రాసి దానిని పాదుషా కిమ్మని ప్రమాణపూర్వకముగా కోరి గౌరవముగా వీడ్కొలిపెను.

వీరందఱును పాదుషాకడకుపోయిరి. తానాషాసుల్తాను మర్యాదచేయఁగా పాదుషావారిని అవమానపఱచెను. తానాషాకడ బహుమతు లందినందులకు చాలగర్హించెను. వారి బిరుదములను తీసివేసి పదవులను తగ్గించెను. రాత్రి మూఁడవ జాములో తానాషాజాబును స్వయముగానే చదువుకొనెను. జాబులో పాదుషాహృదయము కరఁగునట్లు తానాషాప్రార్థించి యుండెను. మనసు కరఁగినవానివలెనై సార్‌బరాఖాౝ అనువానితో ‘మాయాజ్ఞలను తిరస్కరించునభిప్రాయము అబుల్ హసనుకు లేనియెడల అతఁడు చేతులుజోడించుకొని మాకడకు వచ్చిన మాయౌదార్యమునకు తగినట్లు మేము చేయఁగలము.’ అని పాదుషా అనెను. ఇట్లొకవైపు చెప్పుచునే ఏబదివేల గోనెసంచులకు ఆజ్ఞాపించెను.