పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

అక్కన్న మాదన్నల చరిత్ర

కొనిపోయిరి. వారెంతమొత్తుకొనినను వారిని కాపాడుట అసాధ్యమాయెను. కొండమీఁదను కోటగోడలమీఁదను దిబ్బల మీఁదను ఉండినవారుమాత్రమే ప్రాణములను దక్కించుకొనిరి. ఫిరంగికొఱకు కట్టినదిబ్బ కరఁగి నేలమట్టమై పోయెను.

సూర్యోదయమాయెను. గోలకొండ కోటలోపలి సిబ్బంది ఆవులించుచు మేల్కొనెను. తత్క్షణమే ఈ యవకాశమును పూర్తిగా నుపయోగించుకొనుటకు శత్రువులమీఁద కుఱికెను. పాదుషాయెుక్క స్కంధావారములో మిగిలినదానినంతయు ధ్వంసముచేసెను. మొగలాయీ సిఫాయీలనేకులు చంపఁబడిరి. అనేకులు పట్టుబడిరి. మిగిలినవారు తమ ప్రాణములను కాపాడుకొనుటకు పాఱిపోయిరి. ఈ విషయమంతయు తెలియఁగానే పాదుషా ఫిరోజుజంగు ఏమాయెనని యడిగెను. పాదుషా శిబిరమునకును కోటకును నడుమనున్న యొకమసీదులో కొందఱు యోధులతో నాతఁడు తలదాఁచుకొని యున్నాఁడనియు, మూసీనది వెల్లువలు పాఱుచుండినందున శత్రువుల మీఁదికి పోవుట కాతనికి అవకాశము లేకుండెననియు చెంత నున్నవారు చెప్పిరి. సిఫాయీలను దాఁటించుట కుపయోగపడు చుండిన పడవ ఎచ్చటను కానరాకుండెను. పాదుషా హయత్ ఖానను వానిని ఎనుబదిడెబ్బదియేనుఁగులతోపోయి మూసీనదిని దాఁటి వానివీపున నాసర్దారులను తెమ్మని యాజ్ఞాపించెను. వాఁడట్లే బయలుదేరెనుగాని ప్రవాహము చాలవేగముగా నుండినందున ఏనుఁగులకు దాఁటుటకు అదనుచిక్కక ఆ దినము ఆర్థరాత్రము వఱకును, ఆతఁడు ప్రయత్నించి వెనుకకుపోయెను.