పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౨౧ - మరల ముట్టడి ప్రయత్నములు

105

రెండువందల తోలుకవచములను చేయించి సాహసికులకు పంచి పెట్టించెను. గట్టినిచ్చెన నొకదానిని తెప్పించి దానిని కోటగోడలను సాధించు కట్టడముల కానించి తానే ఎక్కుటకు ప్రయత్నించుచు కాలుజారి పడఁబోయి తప్పించుకొనెను. ఈపని పాదుషా కావలయుననియే చేసెను. ఆతఁ డంతగట్టి పట్టుదల చూపనిచో ఇతరులు సాహసములు చూపరని యాతనినమ్మకము.

పాదుషాయొక్క ప్రయత్నములనుచూచి ఖాజీలందఱకు పెద్దయైన ఖాజీఅబ్దుల్లా పాదుషాకడకువచ్చి, శరణాగతుఁడైన ముసల్మానును కొట్టుట మహమ్మదీయాచారమునకును, ఖొరాను ధర్మమునకును విరుద్ధమని పాదుషాతో మనవిచేయఁగా నాతఁడు ఆ ఖాజీని స్కంధావారమునుండి దూరముగా తఱిమివేసెను. ఇట్లే అవమానితులైన ఖాజీలు కొందఱు మక్కాకుపోయిరి.

ఇట్లుండఁగా జూనునెల 16-వ తారీఖున రాత్రి గొప్ప తుపాను కొట్టెను. మొగలాయీవారి స్కంధావార మంతయు నానావిధముల బీభత్సమాయెను, డేరాలును గుడిసెలును చపారములును చిందరవందరగా నెగిరిపోయినవి. కొన్ని తడిసి ముద్దయైనవి. సర్వత్ర బురదరేఁగి పడినగుర్తులు కనఁబడుచుండినవి. పాదుషా వారి కార్ఖానాలలోని సామానులన్నియు వెల్లువలో కొట్టుకొని పోయినవి. సొరంగములందును పల్లములలోను దాఁగియుండినవారందఱును మునిఁగిపోయిరి, గాలిని వానను లక్ష్యముచేయక కోటమీఁదికి లగ్గలెక్కుటకు ప్రయత్నించి ముందునకు సాగినవారందఱును ప్రవాహములో కొట్టు