పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

అక్కన్న మాదన్నల చరిత్ర

దినము సికందర్ ఆడిల్‌షా సుల్తాను తనమంత్రులతో నాలోచించి ఇఁక నీ సర్వజనసంహారమును నిలుపుటకు తాను పాదుషాకు పాదాక్రాంతుఁ డగుటకు నిశ్చయించుకొనెను. కోటలోనిసిబ్బంది చాలవఱకు నాశముకాఁగా రెండువేలమంది మాత్రమే మిగిలి యుండిరి. క్రీ. శ. 1686 వ సంవత్సరము సెప్టెంబరు 12వ తారీఖున విజయాపురముయొక్క కడపటి సుల్తాను సికందర్‌ఆడిల్‌షా తనపూర్వుల సింహసనమును పట్టణమును వదలి, మధ్యాహ్నము ఒంటిగంటకు కొందఱు మొగలాయీ ఉద్యోగులతో ఔరంగజేబును దర్శించుటకు బయలుదేరెను. వీథులకు రెండువైపులను పురజనులు బారులుతీరి నిలుచుండి ఏడ్చుచుండిరి. సికందరుషా తననగరిని కడసారిచూపు చూచుకొని బయలువెడలి రాఁగానే మొగలాయీవారు జయభేరి వాయింపసాగిరి.

ఈలోపల పాదుషా కొలువుతీరియున్న గుడారమును హెచ్చుగాశృంగారించి యుంచిరి. చెంతకు సికందరు రాఁగానే గొప్పయధికారులు కొంద ఱాతని పాదుషాచెంతకు తోడ్కొని పోయిరి. పాపము సికందరుషా పాదుషాపాదములలోవ్రాలెను. ఆతని నవయౌవన సుందరాకారమును రాచఠీవియు చూపరుల గుండెలను కరఁగించి జాలిఁగొల్పుచుండినవి. పాదుషాకే ఆ యువకుని చూచినంతట జాలికలిగినది. సికందరునుచూచి దయతో నిట్లనెను. “భగవంతుఁడు నిన్ను కాపాడునుగాక. నీవు బుద్ధిమంతుఁడవై ఇంతతెలివిగా ప్రవర్తించినది నీ మేలుకొఱకే