పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౭ - మంత్రుల దుర్మరణము

89

సుల్తానును వదలి రజాక్ ఈవలికిరాఁగానే గోలకొండ మీఁదికి మొగలాయీసైన్యము వచ్చుచున్నదని చారులు వచ్చి నివేదించిరి. కాని పాదుషాసైన్యము తాను సదుద్దేశముతో వచ్చుచుండునట్లు ప్రకటించియుండినది. షాఆలము సిఫారసుమీఁద పాదుషా తానాషాకు బహుమతులు పంపెను. ఎట్లును అక్కన్న మాదన్నలు పోయినారు. తానాషా సంధిషరత్తులకు ఒప్పుకొనియుండెను. ధనము చేకూర్చుటకు ఆలస్య మగుచుండెనేగాని తానాషా విరోధింపలేదు. పైగా పాదుషా కుమారుఁడు సుల్తానును క్షమింపవలసినదనియు సిఫారసు చేసి యుండెను. ఇవెల్ల నాలోచించి చక్రవర్తి గోలకొండసుల్తానును మన్నించుమర్యాదగా నాతనికి గొప్పదుస్తులు నగలు పంపుచు వీనిని కొనిపోవుపనిని మీర్‌హషీం అనువానికే పెట్టెను. ఇది చాలసాభిప్రాయము. మీర్‌హషీం గోలకొండసైన్యమునుండి అంతకు కొన్నినెలలక్రిందనే మొగలాయీలకడకు పాఱిపోయి యుండెను. అట్టివానినిపంపిన గోలకొండవారికి తప్పక కోపమువచ్చును. కాని రహస్యముగా పాదుషా, ఈ సాకుతోపోయి గోలకొండను స్వాధీనము చేసికొనిరమ్మని హషీమునకు ఆజ్ఞ యిచ్చియుండెననియు, గోలకొండవాఁడే కాఁబట్టి అతనికి లోగుట్టులన్నియు తెలిసియుండుననియు సంధికి వచ్చియున్నందున గోలకొండవారు కొంతకాలము యుద్ధప్రయత్నము మానియుందురనియు కొంద ఱనుకొనుచుండిరి. ఈవిషయము గోలకొండ చారుల చెవులలోపడినది. దానిని వారు అబ్దుల్‌రజాక్‌లారీతో చెప్పిరి.