పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88

అక్కన్న మాదన్నల చరిత్ర

రాక వారుపోరుగదా. ఎవరికైన నసీబ్ తప్పునా? మంచిమంత్రులు ఘోరపుచావు చచ్చినారు. ఐనను మేమున్నాముగదా. నేను ఇన్నిదినములు తమనౌకరి చేసితిని; తమకొఱకు కత్తిపట్టితిని, తమపేరుచెప్పి పొడుచుచున్నానుగదా. నావంటివారు చచ్చువఱకు తాము దర్వాజా తెఱిపింపకూడదని నాప్రార్థన. మాప్రాణములు హరించి మాశవములమీఁద నడచి శత్రువులోపలికి వచ్చిన మాకు హాయిగానుండును. మాప్రాణములు సంతోషముగా పోఁగలవు. నమ్మక్ తిన్న ఋణము తీరును. హుజూరు సెలవైన ఖిల్లాను నేను కాపాడెదను. నాప్రాణాలమీఁద ఔరంగజేబును లోపలికి రానిండు. సర్కారువారి పాదములవిూఁద అనుగ్రహము కోరుచున్నాను. సెలవిండు” అని చాల దీనముగాను పౌరుషముతోను వేడుకొనెను.

తానాషాహృదయము ద్రవించిపోయెను. అతనినోట మాటరాలేదు. కొన్నినిముసము లాతఁడు జడునివలె నుండెను. రజాక్ మరల ఆమాటలనే పలికెను. తానాషా ఇష్టములేని వానివలెనుండి మెల్లగా ‘సరే, రజాక్‌భాయి, తమ ఇష్టప్రకారమే కానిండు. ఈఖిల్లా అంతయు తమస్వాధీనము, మనకెట్లును వినాశము తప్పదు. అది తమ మనసుప్రకారమే కానిండు. ఈ కొద్దిలో తమ కాయాసమేల.” రజాక్ పరమానందముతో సుల్తానునకు సలాముచేసి వెడలిపోయెను. దర్వాజాలు తెఱువ లేదుగదాయని యందఱును సంతోషించిరి.