పుట:Adhunikarajyanga025633mbp.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇప్పటి శాసనసభలయం దేమాత్రము నమ్మకము లేకుండుట వలననే, తఱచు ప్రతిష్టంభనము చేయుచు, మంత్రివర్గములందు జేరక, సాధ్యమైనంత త్వరితముగా, ఇప్పటి రాజ్యాంగ పద్ధతుల మార్పుచేయవలెనని ఆశించుచుండుట కిదియే ముఖ్య కారణము.

ప్రజలకు ముఖ్యమగు ఆర్థికజీవితముతో నంతగా సంబంధము లేక వివ్విధవృత్తుల యొక్క అవసరానవసరములతో సంబంధము లేక గలజనుల ప్రత్యేకాభిప్రాయముల వెల్లడింప జాలక వివిధ భాగములందు నివసించు అన్నివిధములగు ప్రజలపేరున ధనికుల, భూస్వాముల, కర్మాగారాధిపతుల యాధిక్యతనే బలపరచుచుండు యిప్పటి శాసనసభలు కార్మికులకు నిరుపయోగములు. ప్రజలెల్లరు ఏదోయొకవృత్తివలన తమ జీవనోపాధి సంపాదించుకొనవలసి యున్నది. సంపాదించిన ధనము బెట్టి జీవితాధారముకై వివిధవస్తువుల కొనవలసియున్నది. పూర్వీకులవలన ఆస్తిపొందినవారు తప్ప అత్యధిక సంఖ్యాకులు కార్మికులు. ప్రజలందరును వస్తువుల కొనువారు కనుక, కార్మికులందరికి "వస్తునిర్మాతకుల శాసనసభ" యొక్కటియు, ప్రజలెల్లరికి "భోక్తలశాసనసభ" మరొక్కటియు నిర్మించుచో, ఒక్కటి పనివారెల్లరు కర్మాగారములాదిగా గల వానియందెట్లు జీవించి జీవనోపాధి బొందనగునో నిర్ణయించుననియు, మరొకటి ప్రజలు తమ సంపాదనల నెట్లు