పుట:Adhunikarajyanga025633mbp.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఫ్రాన్సునందును "ఇంటరుపెల్లేషను"ను ప్రభుత్వమున కెదురుగా సభ వారంగీకరించుచో, మంత్రివర్గము మారవలసివచ్చును.

ప్రతిసంవత్సరము, ప్రజాప్రతినిధిసభవారి సమావేశారంభమందును, అంతమందును, ప్రభుత్వముయొక్క చర్యలను సంపూర్ణముగా విమర్శించి, మంత్రివర్గమందు "విశ్వాసరాహిత్యతీర్మానము"ను ప్రతిపాదించుటకు సభ్యునకు హక్కు కలదు. సాధారణముగా ప్రతికక్షి పార్టీకి జెందిన సభ్యుడే పార్టీ వారి యనుమతిపైననే యిట్టి తీర్మానమును చర్చకు తెచ్చును. ఈ యవకాశము నుపయోగించుకొని, ప్రభుత్వమువలన ప్రజలకు కల్గుచుండు యిబ్బందులనన్నిటి ప్రకటించి మంత్రివర్గమువారి కార్యప్రణాళిక అనుభవమందు అదృశ్యమైనట్లు నిరూపించుచు, ప్రతికక్షి వారి రాజకీయప్రణాళిక యెటుల దేశపుటవసరముల దీర్చెడిదో వర్ణించుచు, మంత్రివర్గపు మార్పుకోరుచు సభ్యులుపన్యసించనగును. మంత్రివర్గమును బలపరచువారు మంత్రులొనర్చిన సుకార్యముల వర్ణించి, ప్రభుత్వమువలన కల్గుచున్న లాభముల వివరించి ప్రతికక్షుల బలహీనత, కార్యక్రమ వికలాంగముల నిరసించుటకును అవకాశము కల్గును. తుదకా తీర్మానము సభ వారిచే అంగీకరింపబడినదా మంత్రివర్గము మారవలసినదే! ఫ్రాన్సునందుమాత్రము తఱచు, మంత్రివర్గమువారే "విశ్వాసతీర్మానము"ను ప్రతిపాదించుటయు జరుగుచుండును.