పుట:Adhunikarajyanga025633mbp.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇందువలన, సెనెటుసభవారు, అనేక మారులు ధైర్యముతో ప్రజాప్రతినిధిసభవారి నెదిరించుట కుద్యుక్తులై యుందురు. ఈ రెండుసభలమధ్యను అభిప్రాయభేదము కల్గుచో, వివాదగ్రస్తమగు బిల్లునుగురించి, తీర్మానమునకు వచ్చుటకై, ఈ సభానాయకులు కలసి, ఏదేనొక రాజీకి రాప్రయత్నించవచ్చును. రాజీ సాధ్యముకానిచో రెండుసభలును కలిపి, ఏకసభగా (నేషనల్ అస్సెంబ్లీ) సమావేశమె, ఆబిల్లును చర్చించి, ఏదేనొక తీర్మానమునకు రాబ్రయత్నించవచ్చును. ప్రజాప్రతినిధి సభయందు 584 సభ్యులును, సెనెటునందు 300 సభ్యులే యుండుటవలన, ఈరెండుసభలమధ్య కల్గు వివాదమును చులకనగా ప్రజాప్రతినిధిసభవారికి సుముఖముగా నుండునటుల తీర్మానించ సాధ్యమని తలంచరాదు. ఈరెండు సభలయందును రాచకీయపార్టీ లున్నవి. కనుక మితవాదులు, కన్సర్వేటివుపక్షములవారు సెనెటునందెక్కువ ప్రాముఖ్యత వహించి యుండుటచే, ఆపార్టీవారు, ప్రజాప్రతినిధిసభయం దే యే బిల్లుల నెదిరించుచున్నారో, ఆబిల్లులను రెండుసభలయందున్న తమబలగములనన్నిటిజేర్చి 'నేషనల్ అస్సెంబ్లీ' యం దట్టిబిల్లులను చులకనగా నోడించనగును. కాన, ఫ్రాన్సునందు సెనెటుసభవారు ప్రజాప్రతినిధిసభవారి శాసననిర్మాణ కార్యక్రమమును, వీలుగానున్న ధనికులకు సుముఖముగా జరుగునట్లుచేయును.