పుట:Adhunikarajyanga025633mbp.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రతినిధిసభతోబాటు సమానగౌరవప్రతిపత్తుల సంపాదించుకొని, రాజ్యాంగమున ప్రాధాన్యత బొందజాలకున్నారు. ఇంగ్లాండునందు వంశపారంపర్యాయతా, సభ్యత్వపు హక్కు గల్గిన ప్రభువులచే జీవితాంతమువరకు న్యాయమూర్తులుగా నుండు ప్రభువులచే, ప్రభువులసభ నిండియున్నది. కాని కామన్సు సభవారిముందు, ఎందులకు కొరగాకున్నది. క్రీ. శ. 1911 ఆక్టుప్రకారము కామన్సుసభవారిచే తమ ప్రతికూలమును లెక్కగొనక, రెండుమారులు ఏమార్పులులేకుండ అంగీకరింప బడినబిల్లు శాసనమగును కనుక ప్రభువులసభకు తక్కువస్థానమే లభ్యమగుచున్నది. కవులు, గాయకులు, శాస్త్రజ్ఞులు, కళాభిజ్ఞులు, రాచకార్యధురంధరులు, వాణిజ్యశిఖామణులును జీవితాంతపు ప్రభువులుగా నొనర్చి ఈసభయందు సభ్యులుగా జేసి ఈప్రభువుల సభ కిప్పటికంటె గౌరవము, ఆధిక్యత, అనుభవజ్ఞానము సంపాదితమగునట్లు చేయవలెనని కీ. శే. శ్రీలార్డు బ్రైసుగారు తమ కమిటీనివేదికయందు సూచించిరి. కాని ఇప్పటివరకు ప్రభువుల సభను సంస్కరించుట సాధ్యపడుట లేదు. ఐనను లేబరు ప్రభుత్వము, మైనారిటీపార్టీపై యాధారపడియుండి, హెచ్చుకాలము పెత్తనమందుండుటకు వీలులేకుండుటచే, వారిచే నంగీకరింపబడి కామన్సుసభవారిచే ఆమోదింపబడినబిల్లులను ప్రభువులసభవారు తిరస్కరించి తాత్కాలికముగా, లేబరుశాసననిర్మాణమును మట్టుపెట్టకల్గిరి..