పుట:Adhunikarajyanga025633mbp.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వరకు, సెనేటుసభవారికి శాసననిర్మాణాధికార మొసంగుట వలన ఎట్టియాపదలు సంభవించునో, అమెరికావారి రాష్ట్రీయ శాసనసభల వృత్తాంతములు చెప్పుచున్నవి. ధనికుల, వ్యాపారుల, భూస్వాముల పరమగు సెనేటుసభవారు ఆయల్పసంఖ్యాకుల కగత్యమగు శాసననిర్మాణ కార్యమును, నిష్పక్షపాతముగా, ప్రజలకు లాభకరముగా, దేశాభ్యుదయ కారకముగా జేయజాలరుగదా! తదితరవిషయములం దగత్యమగుశాసనముల నిర్మించుటలో నిష్పక్షపాతముగా, ధర్మాధర్మముల విచారించి, యుక్తాయుక్తములగమనించి, పార్టీలతత్వమును మించి, ప్రజావసరములనే లెక్కించి, తనధర్మము నిర్వర్తించుటకు, సెనేటుసభవారు, తగియుందురని చెప్పజాలము. ప్రజాప్రతినిధిసభవారు ప్రజాసామాన్యపు దృక్పధమునుండియు, సెనేటుసభవారు ధనికులదృక్పధమునుండియు ప్రతివిషయమును విచారించుచుందురు గనుక ఈసభలమధ్యను ఎల్లప్పుడు సంఘర్షణ కలుగక తప్పదు, సంఘర్షణకాలమందు రెండుసభలును తామెవ్వరిపై ఆధారపడియుందురో వారి ప్రత్యేకావసరములనే గమనించుచుండును. ప్రజాస్వామ్యమునందు ప్రజాప్రతినిధిసభకే, ప్రజలయభిప్రాయముల తెల్పుటకును ప్రజాశయములచొప్పున శాసనముల జేయుటకును హక్కుయుండవలెనుగాని, ధనికులకె, భూస్వాములకే చెందియుండు సెనేటుసభవారికట్టి హక్కుయుండుట భావ్యము గాదు.