పుట:Adhunikarajyanga025633mbp.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సెనెటుసభయందు, వృద్ధులును, పూర్వాచారాపరాయణులును, మిత వాదులును, "పోయిన కాలమే పుణ్యకాలము. వర్తమానమె కష్టకాలము, రానున్న కాలము కష్టతరముగాదా" యని సంశయించు నిరాశులును, ధనికులును, కర్మాగారాధిపతులును, భూస్వాములును, జనసామాన్యపు హక్కులందు అవిశ్వాసము జూపువారును సభ్యులుగా నుండుట జూడనగును. ఈసభవారికి శాసనముల మార్చుటగాని, నూతన శాసనముల నిర్మించుటగాని, అంతగా మనస్కరించదు. ఈకాలపు భాగ్యవిభజనపద్ధతి, అనగా కోట్లకొలది ప్రజలకు చిల్లిగవ్వలు, కొలదిమందికి కోటానకోట్లు ధనము లభ్యపడు పద్ధతి, ఈసభవారికి, సత్యకాలపుటేర్పాటుగా దోచును. ఇప్పటి సాంఘికపుటలవాటులుగాని, ఆర్థిక కట్టుబాటులు గాని, రాచకీయపు వ్యవహారములు గాని, మార్పుబొందరా దనుపట్టుదల వీరికి కలదు. కనుక, ప్రజా సామాన్యమునకు హెచ్చుహక్కుల ప్రసాదించుటకు గాని, ప్రజలకు ఆర్థికవ్యవహారములందు పెత్తనముకల్గుటకుగాని, రాచకీయమునం దత్యంతప్రాముఖ్యత సంపాదితమగుటకాని, సాంఘికముగా ఆత్మగౌరవము హెచ్చగుటగాని, ధనికుల, భూస్వాముల గౌరవాధిక్యతలకు లోటుకల్గించునను భయ మీసభవారికి అన్నిదేశములందును కలదని చెప్పవచ్చును. ఇట్టిసభవారు, ప్రజావసరముల గుర్తించి, తగునట్టి శాసన