పుట:Adhunikarajyanga025633mbp.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ ప్రకరణము.

ఐక్య రాజ్యాంగము, సమ్మేళన రాజ్యాంగము

ఒక్కజాతికి జెందిన, ఒక్కదేశమునకు సంబంధించిన, ప్రజలతో మరియేయితర ప్రభుత్వముల సహకారము నపేక్షించకయే రాజ్యాధికారము పొందినదే ఐక్యరాజ్యాంగము. ఈ రాజ్యాంగమునకు లోబడియే, స్థానిక స్వపరిపాలనా సంస్థలు, ప్రజల ప్రత్యేకసంస్థలు తమతమ కార్యముల నెరపుకొనుచుండును. అద్దాని యధికారము, దానికి సంబంధించిన దేశమందు, సంపూర్ణత బొందియుండును. సమ్మేళన రాజ్యాంగమందట్లు లేక, సమ్మేళన ప్రభుత్వమునకు కొంత రాజ్యాధికారము, సభ్యరాష్ట్రములకు మరికొంత రాజ్యాధికారము పంచి యివ్వబడును. ఈ రెండువిధములగు ప్రభుత్వములు పరస్పరముగా సహకార మొనర్చుకొనుచున్నప్పుడే, రాజ్యాంగమంతటి యధికారము, ఐక్యరాజ్యాంగాధికారముతో సమానత్వము బొందకలదు. ఐక్యరాజ్యాంగములను బొందిన రాష్ట్రములు కొన్ని సమ్మేళనమందు జేరిననె, సమ్మేళన రాజ్యాంగ మేర్పడుచున్నది. అట్టియెడ సభ్యతపొందు ప్రతి ఐక్యరాజ్యాంగమును, తన యైక్యత స్వయంనిర్ణయ సూత్రముల వీడి సమ్మేళనమందుజేరి, సమ్మేళన రాజ్యాంగమందు, తన సంపూర్ణస్వరూప ప్రకటనను బొంద గోరుచుండును.