ఈ పుటను అచ్చుదిద్దలేదు
అధికారి హితోపదేశము
1. శ్రీపావన భరతావని
దీపించి దిగంతరముల తేజంబలరన్
వ్యాపించు కీర్తి గూర్చుట
నీపై నుండెను గ్రహింపు మిదియధికారీ!
2. ధర్మార్ధ మోక్ష సాధన
కర్మ క్షితియైన భరత ఖండంబున నీ
ధర్మము పరోపకారము
మర్మము విడనాడి సేయుమా యధికారీ!
3. నీతికి నిలయంబనగా
జాతీయత పుట్టువునకు జన్మస్థలినా
ఖ్యాతిని గాంచిన భారత
జాతికి నీనడతయే యశంబధికారీ!
4. పేదలయెడ నీవెప్పుడు
నాదరమును జూపవలయు నదిధర్మంబౌ
బీదలయానందమె తగ
మేదినికిని క్షేమమగు జుమీ యధికారీ!
5. అధికార మబ్బినంతనె
బధిరము గర్వాంధములను బ్రాప్తించును నా
ప్రధ గలదు సుమ్ము సద్గుణ
నిధివై సత్కీర్తి గనుము నీ వధికారీ!