'మీరంతా ద్వంద్వయుద్ధాలలో వీరధర్మం నిర్వర్తించండి, నేను ముఖ ప్రక్షాళనాది ప్రాతః కాలోచిత కృత్యంబుల నిర్వర్తించెదనుగాక,' అని నవ్వుచు నారాయణరావు బిఱ్ఱబిగిసికొని గుర్రు పెట్టి నిద్రపోవుచున్న మరియొక మిత్రుని 'అరే మహమ్మదుఇబిన్ ఆలం సుల్తాన్ అబ్దుల్ రజాక్ పాదుషాహా సాహెబువారూ! లెండి. మీకీ వైతాళికులు లేరు! రాజ్యం గీజ్యం బూది అయితున్నాయి జహాఁపనాహ' అని లేపినాడు.
ఆలం నిద్దురలేచి "ఏమి తొందరరా!' అనుచు మొగము కడుగుకొనుటకు సిద్ధమయ్యెను. నారాయణరావు తన పనులు నిర్వర్తించుకొని ఉపహారములు కొనిరా వెడలి పోయినాడు.
ఆ యువకమండలి అంతయు పక్కలు చుట్టుకొని సామాను సద్దుకొను లోపల నారాయణ వచ్చి 'ఏమర్రో, ఇడ్లీ, ఉప్మా, కాఫీ, పూరీ, ఉర్లకళంగ్ ప్రత్యక్షమౌతున్నాయి. సేవించటానికి భక్తులందరూ సిద్ధంగా ఉన్నారా!' అని హెచ్చరించి, అవి తెచ్చిన కూలీకడనుండి అంది పుచ్చుకొని, ఆయా సరకులను బల్లలపై నమరింపప్రారంభించినాడు.
లక్ష్మీ: నాకు “చా” తెచ్చావురా?
రాజా : లేదురా! “ఛీ” తెచ్చాడు.
ఆలం : తురకవాణ్ణి నాకే “చా" అక్కర్లేదు, యీడికి ఎందుకోయ్ “చా”? తుమ్ చీనావాడా ఏమిరా భాయ్?
పక్క బండివారు మెయిలిక్కడ అరగంటవరకు ఆగుననియు, గవర్నరుగారి స్పెషలు చెన్నపట్టణము వెళ్ళుచున్నదనియు చెప్పికొనుట విని “ఓరి నాయనా! చెట్లు మొలవాలిరా, బాబూ!” అనుకొనుచు మన మిత్రులందరు ఉపాహారముల నారగించి కాఫీ త్రాగినారు. 'త్రీకాజిల్సు' సిగరెట్ల డబ్బాలు తీసి, సిగరెట్లు వెలిగించి ధూమపాన లోలులైనారు.
నారాయణరావు “పుస్తకాలు ఏవన్నా పట్టుకువస్తానుర" అని హిగిన్ బాదమ్ పుస్తక విక్రయశాలకడకు విసవిస నడచిపోయినాడు. గవర్నరుగారి ప్రయాణసందర్భమున గావలియున్న పోలీసువారు ఆయుధోపేతులై అన్ని వైపులు పహరా ఇచ్చుచున్నారు. ఫలహారపుశాలకాడ వారి బండి ఆగును. కానీ అచ్చట నేరును రాకుండ బందోబస్తు చేసినారు. గవర్నరుగారికి స్వాగత మిచ్చుటకు కృష్ణా కలెక్టరుగారు, పురప్రముఖులు, ఉద్యోగస్తులు మొదలగువారు పూలదండలతో, సన్మానపత్రములతో నిరీక్షించుచున్నారు.
నారాయణరా వీ దృశ్యమంతయు జూచుచు పుస్తకశాలకడ నాలోచనా నిమగ్నుడై నిలుచుండిపోయినాడు. నారాయణరా వాజానుబాహుడు, అయిదడుగుల పదనొకం డంగుళముల పొడవువాడు. బలసంపదకు, నెలవైనవాడు. ఉజ్జ్వల శ్యామలుడు. చిన్నవై, తీష్టమైన లోచనములు తీరై, సమమై కొంచెము పొడుగైన ముక్కు దూరస్థములగు నా కన్నుల మధ్య ప్రవహించి, ధనస్సువలె తిరిగి పోయిన పై పెదవికి నాతిదూరమున నాగింది. అతని నోరు సుందరమై పద్మినీజాతి లలనా రత్నమునకు వన్నె తీర్చునట్టిదై యున్నది. ఆ లోపమును ఉత్తమనాయక లక్షణమగు నామ్రచిబుకము దృఢరేఖాచకితమై ధీరత్వము పుంజీభవింపజేయుచు తీర్చివేసినది. మునిగిపోయినాడు.
నారాయణరావు కుడిచేతి చూపుడు వ్రేలితో నడుగు పెదవిని నొక్కుకొనుచు, బొమలు ముడిచి, విశాలఫాలము, వీచికల నిండిన పాల సముద్ర మట్లయిపోవ, పరధ్యానములో ఆలోచనలు మరల్చుకొని
ఉన్నట్లుండి తన్ను ఎవరో తీక్షదృష్టులు చూచుచున్నట్లు కాగా,
ఎదుట నిలుచుండి తన్ను వింతచూపులతో గమనించునొక పెద్ద మనుష్యుని పరికించినాడు.
అడివి బాపిరాజు రచనలు - 1
2
నారాయణరావు (నవల)