పుట:Abraham Lincoln (Telugu).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాడు గాడు. తన ప్రాణముల గాపాడుకొనుతెఱంగున బుస్తుకముల గాపాడుకొనుచుండును. కావున నతడు జోషియాకు "అయ్యా! మీగ్రంథము నుపేక్షసేయక దాచి మంచి స్థితియందు గొద్దిదినములలో దెచ్చియిచ్చెద" ననిచెప్పి చాల సంతసమున నాపుస్తుకముం దీసికొని పోయెను. తనపని యంతయు నైనపిదప బ్రతి సాయంకాలము సంపూర్ణ మగ్నతతో నాగ్రంథము చదువుచు వచ్చెను. మధ్యకాలమున నెప్పుడొకనిమిష మవకాశమున్న నాపుస్తుక మవలోకించుటయంద దాని గడపుచుండెను. ఒకనాడు గాలివాన విశేషమైయుండి పని లేనందున దినమంతయు జదువుచునే యుండెను. పరుండ బోవు సమయమున దా జదువుపొత్తమును రెండుమొద్దుల మధ్యభాగమున దాచెను. రాత్రియందు గాలి ప్రబలి జల్లు గొట్టి యా పుస్తుక మంతయు దడిసిపోయెను. తెల్లవారి లేచి తన ప్రియవస్తు వా స్థితి నుండుటకు జాల చింతిల్లి జోషియాకు మొగముసూప సి గ్గగు గదాయని దు:ఖించి యత డేమిపని యడిగిన నాపనిచేసి యతని సంతోష పెట్టుద మని నిశ్చయించుకొని యతని జూడ వెడలెను. జోషియా యీవార్త వినినతోడనె మండిపడ జొచ్చెను. మధు పానపు మత్తు సహజ హృదయ కాఠిన్యమునకు సహకారి యాయెను. అయిన నాబ్రహామునుండి పనిదీసుకొను నాశ యతని