పుట:Abraham Lincoln (Telugu).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చుండెను. అయినను దైవానుగ్రహము దప్పినందున గొంత కాలమునకు వారిరువురును లోకాంతరగతు లైరి. శోకము లింకనుల హృదయముల నాక్రమించెను. ఆప్రాంతపు జనులెల్లరు నప్పుడప్పుడు స్పారోల స్థితిగతుల దెలిసికొనుచుండి వా రంత మొందిరనుట వినినితోడ నేతెంచి యనంతర కార్యముల నడపిరి. థామసునకు దప్ప మఱేరికిని శవము నుంచుటకు బెట్టెసేయుటకు రాదు. కావున నతడె దనశక్తికొలది దాని నొనర్చెను. స్పారోల నద్దానియం దుంచి యందఱును నశ్రుధారల దమప్రేమ గనుబఱచుచు నుచితవిధమున వారికి సమాధి యొనర్చిరి. ఆబ్రహాము డెన్నిసుల కిదియ మిక్కిలి దు:ఖకరం బగు వార్తగ నుండెను.

తగిలినకాలె తగులును; నొగిలినకొంపె నొగులుననుట యనృతముగాదు. దు:ఖము లొక్కటిమీద నొకటి తరంగంబుల తెఱంగున పై బడుచుండును. స్పారోల మరణముచే నుద్భవిల్లిన సంతాపాగ్నిజ్వాల లింకనుల మనోవీధి బ్రచండంబుగ రేగుచుండ బ్రళయకాలవహ్నింబోలు మఱియొక వహ్ని యట జేరె. స్పారోలు నాకలోకంబునకు జన్న దాదిగ గొన్నిదినములకు స్తన్యరోగము నాంసీనె యంటె. ప్రాత:కాలము మూడుగంటలసమయమున నాబ్రహాము నిద్రనుండి లేవదీయ బడియెను. సమాచారము వినినతోడనె యామె