పుట:Abraham Lincoln (Telugu).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజ్ఞానచంద్రికాగ్రంథమాల.

ఆంధ్రజనుల కొకవిన్నపము,

దేశాభివృద్ధికి భాషాభివృద్ధి యొక గొప్ప సాధనంబని యందఱికిం దెలిసినవిషయమె ఇంగ్లీషువారి యభివృద్ధికి వేఱుకారణంబు లనేకములున్నను* నందుకు వారిభాషాభివృద్ధి యొక మఖ్యకారణ మని విద్వాంసుల యభిప్రాయమై యున్నది. ఇంగ్లండుదేశంబున బ్రస్తుత మున్న గ్రంథ సంగ్రహంబును వార్తాపత్రికలును నేదో యొక దైవిక కారణముచే నేడు లేకుండ నయ్యెనేని ఆదేశము తన యాదిమయుగములోని యనాగరికతకు దిగు నని చెప్పుట యతిశయోక్తి గానేరదు. ఇంగ్లండులోని వార్తాపత్రిక లాదేశమునకు మేలుగాని కీడుగాని కలుగ జేయు సామర్థ్యము గల యొక స్వతంత్రసామ్రాజ్యముగ నెంచబడుచున్నవి. ఇంగ్లీషు పత్రికారాజ మగు 'లండన్ టయిమ్స్‌' పత్రికయొక్క యనుగ్రహమును, జర్మనీచక్రవర్తియు, నమెరికా దేశాధ్యక్షుడును గోరుచుండెద రని మనము వినుచున్నాము. ఇట్టి మహిమ యాపత్రికకు గల్గుటకు గారణం బేమి? ఆపత్రిక చేయుచున్న భాషాభివృద్ధియు దన్మూలకముగా లోకులలో బ్రసరించు చున్న జ్ఞానాభివృద్ధియు నిందుకు గారణము లని వేఱుగ జెప్పవలెనా? 'భాషాభివృద్ధి' 'జ్ఞానాభివృద్ధి' 'దేశాభివృద్ధి' యనుశబ్దములు పర్యాయపదము లని చెప్పనగు. వాజ్మయంబు (Literature) న దగినగ్రంథములు లేనిభాష శిశువుల వచ్చిరాని పలుకులవంటిది. బాలుని యస్పష్టపదములు కొన్నిదినములకు స్పష్టములయినగాని యెటుల వ్యవహారమునకు బనికిరావో యటులనే భాషయం దన్నివిషయములనుగుఱించిన గ్రంథసంగ్రహమున్నంగాని యది జ్ఞానాభివృద్ధికిని, అందుమూలకముగా దేశాభివృద్ధికిని నుపయోగపడనేరదు. అట్లు గ్రంథసంగ్రహము లేనిభాషయే తమమాతృభాషగా గలజనులు శిశువులను బోలి యజ్ఞానమునం దుండవలసివచ్చును. కాన దేశభాషల నభివృద్ధిచేయుట దేశాభిమానుల ప్రథమకర్తవ్యము.